- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రామాలు బంద్ చేయాలి: కాంగ్రెస్, బీజేపీకి మాజీ ఎంపీ వార్నింగ్
తుమ్మిడిహెట్టి విషయంలో కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు బంద్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తుమ్మిడిహెట్టి విషయంలో కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు బంద్ చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు తాను అడ్డుపడితే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని.. రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎంకు లెటర్ రాయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారని.. సీఎం మాత్రం కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని అంటున్నారని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది మాజీ సీఎం వైఎస్ఆర్ అని.. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్విరాజ్ చవాన్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లెటర్ రాసి 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టికి అనుమతి ఇచ్చేది లేదని చెప్పారని తెలిపారు. ఆ సమయంలో కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని అయినా సాధ్యపడలేదన్నారు.
రేవంత్‌రెడ్డి ఎవరిని మోసం చేద్దామని ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సైతం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదన్నారు. ముంబైలో ఐదు రోజులు ఉండి ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేశామన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తానే పోరాటం చేశానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ఫడ్నవీస్ చెప్పారని వెల్లడించారు. మహారాష్ట్ర సీఎంతో ఘర్షణ పూరితంగా రేవంత్‌రెడ్డి ఎట్లా వెళ్తారని నిలదీశారు. ఏడాది క్రితం బండి సంజయ్ మాట్లాడుతూ ఆరు నెలల్లో పర్మిషన్ తెస్తానని చెప్పారని.. ఇప్పటివరకు గతి లేదన్నారు. రేవంత్‌రెడ్డికి మేడిగడ్డనే దిక్కు అని.. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే ఆప్షన్ అని సూచించారు. ఇప్పటివరకు మేడిగడ్డ కొట్టుకుపోతుందని చూశారని.. ఏం కాకపోవడంతో రిపేర్లు స్టార్ట్ చేశారని అన్నారు. అంతేకాకుండా.. ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వరని రేవంత్‌రెడ్డికి తెలుసని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు.






