కాంగ్రెస్‌ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు

by Malleboina Mahesh |

ఆర్మూర్ కాంగ్రెస్‌లో వెన్నుపోటు రాజకీయాలు జరుగుతున్నాయి. చైర్మన్ అభ్యర్థులను ఓడించేందుకు సొంత నేతల కుట్రలు చేస్తూ.. ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చి మరీ ఆరు సీట్లు దెబ్బతీశారు.

కాంగ్రెస్‌ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన వెన్నుపోటు రాజకీయాలు ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ పోరులో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని కోవర్టుల బెడదే ఎక్కువైందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చైర్మన్ పదవిని ఆశించిన అభ్యర్థులను సొంత పార్టీ నాయకులే పథకం ప్రకారం ఓడించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

చైర్మన్ అభ్యర్థుల లక్ష్యంగా కుట్రలు..

ఆర్మూర్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ పదవి మహిళా జనరల్‌కు రిజర్వ్ కావడంతో ప్రధానంగా నలుగురు అభ్యర్థులు రేసులో నిలిచారు. 17వ వార్డులో ఏబీ. శ్రీదేవి శ్రీనివాస్ (చిన్న), 18వ వార్డులో సంగీత శ్రీనివాస్ ఖందేశ్, 19 వ వార్డులో గడ్డం జ్యోతి మారుతి రెడ్డి, 3వ వార్డులో మోత్కూరి విజయ లింగాగౌడ్ కౌన్సిలర్ స్థానాలకు పోటీ పడ్డారు. అయితే, వీరు గెలిస్తే తమకు పోటీ వస్తారనే ఉద్దేశంతో కొందరు ముఖ్య నాయకులు ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులకు భారీగా డబ్బులు పంపిణీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కోవర్టులతోనే పార్టీకి నష్టం..

ముఖ్యంగా 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇలియాస్ నామినేషన్ ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు చేయకపోవడం చర్చనీయాంశమైంది. అదే వార్డులో ప్రధాన పార్టీ అభ్యర్థికి చైర్‌పర్సన్ పదవి ఆశించే ఓ వ్యక్తి డబ్బులిచ్చి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారకులయ్యారని తెలుస్తోంది. 19వ వార్డులో గడ్డం జ్యోతి మారుతి రెడ్డిని ఓడించేందుకు ప్రత్యర్థులకు సహకరించారని, 3వ వార్డులో మోత్కూరి విజయ లింగాగౌడ్‌కు వ్యతిరేకంగా ఒక స్వతంత్ర అభ్యర్థిని నిలిపి డబ్బులిచ్చి ప్రోత్సహించారని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

17వ వార్డులో చైర్‌పర్సన్ అభ్యర్థి ఏబీ.శ్రీదేవి శ్రీనివాస్ (చిన్న)కు ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి రహమత్ ఉన్నిసాకు కొందరు డబ్బులిచ్చి ప్రోత్సాహం అందించారని, వెన్నంటే ఉండి ప్రత్యర్థి వర్గానికి ఇతోధికంగా సహాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 1వ వార్డు అభ్యర్థి పుతిలి బేగం రెహమాన్ ఓటమి కోసం స్వతంత్ర అభ్యర్థి సూరయ్య ఫాతిమాకు కాంగ్రెస్ నాయకులే రూ.7 లక్షలకు పైగా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. 30వ వార్డు అభ్యర్థి కోల వెంకటేష్‌ను కూడా సొంత పార్టీ నాయకులే ప్రచారం చేయించి ఓడించారని వార్డు నాయకులు చెబుతున్నారు.

రెండు వర్గాలుగా చీలిన పార్టీ..

కాంగ్రెస్ పార్టీలో ఏబీ.శ్రీదేవి శ్రీనివాస్ (చిన్న)తో పాటు గడ్డం జ్యోతి మారుతి రెడ్డి, కందేశ్ సంగీత శ్రీనివాస్, మోత్కూరి విజయ లింగా గౌడ్, పుతిలి బేగం రెహమాన్ వంటి ఆశావహులందరినీ సొంత పార్టీ కోవర్టులే దెబ్బతీశారు. వీరందరూ గెలిచి ఉంటే కౌన్సిల్‌లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగేది. ఆర్మూర్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఒకరినొకరు ఓడించుకునేందుకు పక్కా ప్రణాళికతో తెరవెనుక రాజకీయాలు చేశారనే విషయం స్పష్టమవుతోంది. పురాతన కాంగ్రెస్ పార్టీలోనే అభ్యర్థులపై ఇలాంటి కుట్రలు జరుగుతున్నా నాయకత్వం పసిగట్టలేకపోవడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్రులకు డబ్బులు, ఇతర సహాయాలు అందిస్తూ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్ల బలం తగ్గింది.

Next Story