ఈ ఏడాదిలో జీతాలు సగటున 9 శాతం పెరగొచ్చు!

by Disha Web Desk 17 |
ఈ ఏడాదిలో జీతాలు సగటున 9 శాతం పెరగొచ్చు!
X

ముంబై: దేశవ్యాప్తంగా సానుకూల పెట్టుబడుల ధోరణి నేపథ్యంలో భారతీయ కంపెనీలు ఈ ఏడాదిలో సగటున 9 శాతం జీతాల పెంపు ఇచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. ముఖ్యంగా తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో వేతన పెంపు గణనీయంగా ఉండనుంది. ప్రముఖ రిక్రూట్‌మెంట్ సంస్థ మైఖెల్ పేజ్ రూపొందించిన శాలరీ రిపోర్ట్-2022 నివేదిక ప్రకారం.. 2022 లో వేతనాల పెంపు కరోనాకు ముందు 2019లో ఉన్న 7 శాతం కంటే మెరుగ్గా 9 శాతం ఉండనుంది. స్టార్టప్‌లతో పాటు కొత్త జనరేషన్ కార్పొరేషన్‌లు, యూనికార్న్ కంపెనీలు వేతనాల పెంపునకు సంబంధించి 12 శాతంతో ఈ ధోరణికి మద్దతివ్వనున్నాయి.

ప్రధానంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆస్తి-నిర్మాణంతో పాటు తయారీ రంగాలకు చెందిన కంపెనీలు జీతాలను పెంచడంలో ఎక్కువ సానుకూలతను కలిగి ఉన్నాయి. ఈ-కామర్స్, డిజిటల్ విభాగాలకు మారుతున్న తరుణంలో ఈ-కామర్స్, ఇతర సంబంధిత కంపెనీల్లో అనుభవం కలిగిన సీనియర్ స్థాయి ఉద్యోగులు అత్యధిక వేతనాలను అందుకోనున్నారు. అంతేకాకుండా డేటా సైంటిస్ట్‌లు, వెబ్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. చాలావరకు కంపెనీలు తమ వద్ద ఉన్న అత్యంత మెరుగైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు త్రైమాసికానికి, అర్ధ వార్షికానికి ప్రోత్సాహకాలు, ప్రమోషన్‌లు, బోనస్‌లు, షేర్ల కేటాయింపు సహా పలు రకాల ఇంక్రిమెంట్లతో వలసలు పోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని నివేదిక తెలిపింది.

అధిక పనితీరు కలిగిన ఉద్యోగులు మిగిలిన సాధారణ ఉద్యోగుల కంటే అధిక ఇంక్రిమెంట్లను ఆశిస్తున్నారని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న అట్రిషన్ రేటు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత కారణంగానే కంపెనీలు ఈ ఏడాది మెరుగైన వేతన పెంపునకు సిద్ధంగా ఉన్నాయని మైఖెల్ పేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ అగర్వాలా వెల్లడించారు.


Next Story

Most Viewed