సంతోష్‌నగర్‌లో దారుణం.. వృద్ధుడిని కొట్టి చంపిన దుండగుడు

by Ratna Kumari |

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్‌లో ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

సంతోష్‌నగర్‌లో దారుణం.. వృద్ధుడిని కొట్టి చంపిన దుండగుడు
X

దిశ, జవహర్‌నగర్ : జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్‌లో ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన మడిగే దేవరాజ్ అలియాస్ ఉప్పరి దేవరాజు (83) ఇటీవల భార్య మృతి చెందడంతో ఒంటరిగా నివసిస్తుండగా, కుమారులు సమీపంలో ఉంటూ ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. గత నెల 30వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి అక్కడే పడుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన దేవరాజు విద్యుత్ దీపం వేయగా, దుండగుడు కోపోద్రిక్తుడై ఆయన తలపై పలుమార్లు పిడిగుద్దులు గుద్ది దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మృతుడి కుమారుడు ప్రభాకర్ అక్కడికి చేరుకుని చూడగా, దేవరాజు రక్తపు మడుగులో మృతిచెంది ఉండగా, పక్కనే ఓ వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. అతడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ ఇల్లు తనదేనని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను **దేవా (30), సిద్దిపేట జిల్లా వాసి** అని గుర్తించారు. నివాసం దొరక్క ఆ ఇంట్లో పడుకున్నానని, వృద్ధుడు పలుమార్లు లైట్ వేయడంతో కోపంతో తలపై దాడి చేయగా మృతి చెందినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ సైదులు తెలిపారు.

Next Story