కూతురి బర్త్ డే వేడుకలు.. విద్యుత్ షాక్‌తో తండ్రి మృతి

by Batti.Sumithra |

తన కూతురి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేద్దామనుకునేలోపే ఓ తండ్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.

కూతురి బర్త్ డే వేడుకలు.. విద్యుత్ షాక్‌తో తండ్రి మృతి
X

దిశ, సంగారెడ్డి : తన కూతురి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేద్దామనుకునేలోపే ఓ తండ్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన తలారి రంజిత్ కుమార్ (34) కరెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం ఉదయం సుమారు 09:20 గంటల సమయంలో గ్రామానికి చెందిన గౌండ్ల భర్తయ్య పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయిందని సమాచారం అందడంతో దానిని అమర్చేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో ఫ్యూజ్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి 11 కేవీ విద్యుత్ లైన్‌కు కుడి చేయి తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే సహచరులు, స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధి నిర్వహణలో ఉండగానే జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటన పై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే మరికొద్ది రోజుల్లో తన ఒక్కగానొక్క కూతురు మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా చేద్దామనుకున్న రంజిత్ ఈలోపే మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Next Story