సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

by Kodari Anjali |

మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, కనగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రూ.14 వేల కోట్ల వ్యయంతో హ్యాం విధానంలో నిర్మించనున్న డబుల్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. శనివారం కనగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ స్థలం, హెలిప్యాడ్, పైలాన్ నిర్మాణ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,300 కిలోమీటర్ల మేర రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కనగల్ మండలం ధర్వేశిపురం–డిండి రహదారితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానించే డబుల్ రోడ్ల నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, ఏఆర్‌పీ కాలువల లైనింగ్, నల్గొండ మున్సిపాలిటీ తాగునీటి పనులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అదే రోజు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి..

ముఖ్యమంత్రి సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, టెంట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సభ విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్,డి.ఎస్.పి శివరాం రెడ్డి,గ్రామ సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ గౌడ్, ఎల్లమ్మ ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్ రెడ్డి,ఆర్టిఏ మెంబర్ కూసుకుంట్ల రాజురెడ్డి, ఎంపీడీవో వేద రక్షిత, తహసిల్దార్ పద్మ, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గోలి జగాల్ రెడ్డి, ఎల్లమ్మ ఆలయ మాజీ చైర్మన్ కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, సీఐ ఆదిరెడ్డి, ఎస్సై కే. రాజీవ్ రెడ్డి, బోగరీ రాంబాబు, వంపు జానయ్య, పందుల రాజా ఆర్ అండ్ బి అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story