- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీబీజీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీబీజీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీబీజీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కేంద్రానికి అధికారికంగా నిరసన లేఖ రాయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వీబీజీ రాంజీ స్కీంపై లేఖలో పొందుపరచాల్సిన అంశాలపై మంత్రి సీతక్క జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనిదినాల కేటాయింపును డిమాండ్ ఆధారంగా కాకుండా, నార్మేటివ్ విధానంలో చేయడం వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.
60 రోజుల విరామం ఎందుకు..
వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులకు విరామం ఇవ్వాలనే కేంద్రం నిబంధనను మంత్రి సీతక్క తప్పుబట్టారు. తెలంగాణలో పంటల సీజన్‌లోనే వర్షాలు కురుస్తాయని, ఇదే సమయంలో మొక్కలు నాటడం, వనమహోత్సవం వంటి పనులు జరుగుతాయని తెలిపారు. ఈ సమయంలో 60 రోజుల విరామం ఇస్తే, కేంద్రం చేపట్టిన గ్రీన్ ఇండియా లక్ష్యాలు దెబ్బతింటాయని సీతక్క స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో పంటల సీజన్ 60 రోజుల పాటు ఉండదని, అక్కడ ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు.
పూర్తి నిధులను కేంద్రమే భరించాలి..
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు, నిర్మాణాలు పూర్తయ్యే వరకు పూర్తి నిధులను కేంద్రమే భరించాలని సీతక్క డిమాండ్ చేశారు. కొత్త విధానం అమలును వాయిదా వేయాలని కోరతామని చెబుతూనే, ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఈ స్కీంను అమలు చేయాల్సి వస్తే, ఉపాధి కూలీలకు ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క భరోసానిచ్చారు. దీనికి సంబంధించిన ముసాయిదా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గంతో చర్చించిన అనంతరం, ఈ పథకం పై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ స్కీంను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.






