జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్‌లో అసెస్మెంట్ మాయాజాలం

by Malleboina Mahesh |

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ లో అసెస్ మెంట్ మాయాజాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది.

జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్‌లో అసెస్మెంట్ మాయాజాలం
X

దిశ, చైతన్యపురి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ లో అసెస్ మెంట్ మాయాజాలం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నది. సర్కిల్స్ వేరైనా ముడుపులు అధిక మొత్తంలో ఇస్తారంటే వేరే సర్కిల్ వారైనా అసెస్మెంట్ లు చేయడానికి ముందుకు రావడం గమనార్హం. కోర్టు వివాదాలున్న భవనాలకు సైతం డబ్బులు ఇస్తే అసెస్మెంట్ చేసేస్తారు. అవును.. ఇదంతా నిజం అక్షరాలా జరిగిన వాస్తవం.

అసలు పరిస్థితి ఏమిటి..?

హయత్ నగర్ సర్కిల్ ప్రస్తుతం నాగోల్ సర్కిల్ పరిధిలోకి వచ్చే మన్సూరాబాద్ డివిజన్లో ఉన్న ఓ ఇంటికి నిబంధనలకు విరుద్ధంగా అసెస్ మెంట్ అనగా ఇంటి నెంబర్ కేటాయించాలని ఓ వ్యక్తి అధికారులను ఆశ్రయించాడు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో హయత్ నగర్ (నాగోల్ )సర్కిల్ అధికారులు నిరాకరించారు. దీంతో సరూర్ నగర్ సర్కిల్ అధికారులను సదరు వ్యక్తి అసెస్మెంట్ చేయాలని ఆశ్రయించాడు. వారు నిబంధనలను బేఖాతరు చేస్తూ తమ పరిధి కాకపోయినా ఇంటి నెంబర్ కేటాయించి అసెస్మెంట్ చేశారు. ఇది చేయడానికి సదరు వ్యక్తి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందజేసినట్లు చర్చ జరుగుతున్నది. ఎక్కడా లేని నిబంధనలకు విరుద్ధంగా ఒక సర్కిల్ పరిధిలోకి వచ్చే అసెస్ మెంట్ ను మరో సర్కిల్ పరిధిలోకి వచ్చే అధికారులు చేయకూడదు.

ఎక్కడ ఇది..?

మన్సూరాబాద్ డివిజన్లోని ఇంటి నెంబర్ 3-8-439/1 ఉంది. 13, ఫిబ్రవరి 2013లో డాక్యుమెంట్ నెంబర్ 996 గా రిజిస్ట్రేషన్ అయింది. ఈ డాక్యుమెంట్ ప్రకారం హయత్ నగర్ (నాగోల్ ) సర్కిల్ పరిధిలోకి వస్తుంది. పక్కనే ఉన్న ఎల్బీనగర్ సర్కిల్ కాదని దూరంగా ఉన్న ఏ మాత్రం సంబంధం లేని సరూర్ నగర్ సర్కిల్ అధికారులు అసెస్ మెంట్ చేసి పీటీఐ నంబర్ 1050315474 కేటాయిస్తూ పని పూర్తి చేశారు. ఈ భవనం వివాదాల నడుమ కోర్టులో కేసు నడుస్తున్నట్లు తెలిసింది. అయినా బేఖాతరు చేస్తూ సరూర్ నగర్ సర్కిల్ రెవెన్యూ అధికారులు ఇంటి నెంబర్ కేటాయించారు. 60 గజాలున్న సామాన్యుడు ఇంటి నెంబర్ కావాలని దరఖాస్తు చేసుకుంటే ఎన్నో కోర్రీలు పెట్టి ఇబ్బందులకు గురి చేసే అధికారులు కాసులకు కక్కుర్తి పడి తన పరిధులు దాటి కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రెవెన్యూ విభాగం కనుసన్నల్లో..

సరూర్ నగర్ సర్కిల్ రెవెన్యూ విభాగంలో ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్లుగా ఉంది వ్యవహారం. సంబంధిత ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా? లేక వారికీ తెలియకుండా వారి లాగిన్ ఉపయోగించి కింది స్థాయి అధికారులు ఈ పని చేశారా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అయినా ఉన్నతాధికారులు అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటారు అనేది కూడా గ్రహించాలి. ఒక సర్కిల్ అసెస్ మెంట్ ను మరో సర్కిల్ అధికారులు చేయడంతో ఇక్కడ జరగరాని తప్పు జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారో చూడాలి మరి. ఈ విషయమై సరూర్ నగర్ సర్కిల్ రెవెన్యూ ఉన్నతాధికారులను వివరణ కోరగా.. తప్పు జరిగింది వాస్తవమని తెలిపారు. తమ ప్రమేయం లేకుండా అసెస్మెంట్ జరిగినట్లు గుర్తించామని, దీనిపై లోతుగా పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు.

Next Story