ఉమ్మడి నిజామాబాద్‌లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు

by Malleboina Mahesh |

ఉమ్మడి నిజామాబాద్‌లో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు! పునర్విభజనతో కొత్తగా కోటగిరి, కామారెడ్డి అర్బన్, రూరల్ నియోజకవర్గాల ఏర్పాటుపై జోరుగా చర్చ.

ఉమ్మడి నిజామాబాద్‌లో పెరగనున్న అసెంబ్లీ సీట్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న తొమ్మిది నియోజక వర్గాలకు అదనంగా మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన నిజామాబాద్ లో రెండు లేదా మూడు, కామారెడ్డి లో ఒకటి లేదా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని మోస్రా, వర్ని, కోటగిరి, చందూర్ మండలాలు కూడా ఉన్నాయి.

ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నిజామాబాద్ పరిధిలోని మండలాలు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నుండి వేరు చేసి బోధన్ నియోజకవర్గంలోని ఒకట్రెండు మండలాలను కలిపి కొత్తగా కోటగిరి నియోజకవర్గంగా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని కామారెడ్డి మున్సిపల్ పరిధితో పాటు కామారెడ్డి మండలం, శివారు గ్రామాలను కొన్నింటిని మున్సి పాలిటీలో విలీనం చేసి ప్రత్యేకంగా కామారెడ్డి అర్బన్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి మండలాలతో కలిపి కామారెడ్డి రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే ఛాన్సుందనే ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్ జిల్లాలో...

జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని పరిధిలో భారీగా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ ను రెండుగా విభజించి నార్త్ సౌత్ గా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని, ఆయా నియోజకవర్గాల పరిధిలోకి కొత్తగా కొన్ని మండలాలను కలిపే ఛాన్సుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..? కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్ కాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.

డీలిమిటేషన్ కమిటీ ఈ డిమాండ్ ను కూడా పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒక వేళ అదే జరిగితే నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ, డిచ్ పల్లి, ధర్పల్లి, కామారెడ్డి జిల్లాలోని గాంధారి, బాల్కొండ సెగ్మెంట్లోని కమ్మర్ పల్లి మండలాల్లోని పలు గిరిజన గ్రామాల సమూహాలతో ఎస్టీ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారేమోనని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అయినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజక వర్గాలు సంఖ్య పెరగనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడున్న తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో మూడు లేదా నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో చేరనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతమున్న పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడున్న 5 అసెంబ్లీ స్థానాలు ఎనిమిదికి, కామారెడ్డి జిల్లాలోని నాలుగు స్థానాలు ఐదు లేదా అరుకు చేరవచ్చనే చర్చ ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Next Story