విరాట్ కోహ్లీ వైరల్ వీడియోతో సహా 200 పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్

by Malleboina Mahesh |

వరుస వివాదాల నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లోని కోహ్లీ వీడియోతో సహా 200 పైగా పోస్టులను డిలీట్ చేశారు.

విరాట్ కోహ్లీ వైరల్ వీడియోతో సహా 200 పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ పేసర్, ప్రస్తుతం పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సోషల్ మీడియాపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రీల్స్, వ్లాగ్స్ పోస్ట్ చేసే అతను.. తన ఖాతాలోని సుమారు 200కు పైగా పోస్టులు, రీల్స్‌ను డిలీట్ చేశారు. అంతేకాకుండా తన డిస్‌ప్లే పిక్చర్ (DP)ని మార్చేసి, బయోను కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రొఫైల్‌లో కేవలం 44 పోస్టులు మాత్రమే మిగిలాయి. ఇందులో గత ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన రీల్ (సుమారు 150 మిలియన్ల వ్యూస్ సాధించిన వీడియో) కూడా డిలీట్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఖాతాలో కేవలం బ్రాండ్ ప్రమోషన్లు, ఫ్యామిలీ ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ముగిసిన వెంటనే అర్ష్‌దీప్ సింగ్ తీసుకున్న ఈ ఇన్‌స్టా ‘క్లీన్ అప్’ నిర్ణయం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అర్ష్‌దీప్ మైదానంలోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు సహచర ఆటగాడు తిలక్ వర్మను ఉద్దేశించి "ఓయ్ అంధేరే.. సన్‌స్క్రీన్ రాసుకున్నావా?" అంటూ అర్ష్‌దీప్ చేసిన 'క్యాజువల్ రేసిజం' (బాడీషేమింగ్/వర్ణవివక్ష) వ్యాఖ్యల వీడియో తీవ్ర దుమారం రేపింది.

దీనిపై మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్ష్‌దీప్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు పంజాబ్ కింగ్స్ సహచర ఆటగాడు ప్రియాంశ్ ఆర్యతో చేసిన మరో స్నాప్‌చాట్ వీడియో, వ్లాగ్‌లో యుజ్వేంద్ర చాహల్ ఈ-సిగరెట్ తాగుతూ కనిపించిన క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. ఈ వరుస వివాదాల నేపథ్యంలో బీసీసీఐ (BCCI) గట్టిగా హెచ్చరించడం వల్లే అర్ష్‌దీప్ తన వివాదాస్పద పోస్టులన్నింటినీ తొలగించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, ఈ పోస్టుల డిలీషన్‌పై అర్ష్‌దీప్ సింగ్ గానీ, పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Next Story