ఇరాన్‌లో తీవ్రతరం అయిన ఆందోళనలు.. రంగంలోకి దిగిన ఆర్మీ.. తీవ్ర హెచ్చరికలు జారీ

by Malleboina Mahesh |

ఇరాన్ దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కారణంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ద్రవ్యోల్బణం దాదాపు 40-50% వరకు పెరగడంతో ఆ దేశంలో సామాన్యులు బ్రతకడమే కష్టం గా మారింది.

ఇరాన్‌లో తీవ్రతరం అయిన ఆందోళనలు.. రంగంలోకి దిగిన ఆర్మీ.. తీవ్ర హెచ్చరికలు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కారణంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ద్రవ్యోల్బణం దాదాపు 40-50% వరకు పెరగడంతో ఆ దేశంలో సామాన్యులు బ్రతకడమే కష్టం గా మారింది. అలాగే ఇరాన్ కరెన్సీ (రియాల్) విలువ దారుణంగా పడిపోయింది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యంపై ఉన్న సబ్సిడీలను తొలగించడంతో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారస్థాయికి చేరుకున్నాయి. నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. రాజధాని టెహ్రాన్ వీధుల్లోకి జనం పోటెత్తడంతో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉధృతంగా మారుతుండటంతో ఆ దేశ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశ "జాతీయ ప్రయోజనాలను" కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇజ్రాయెల్, ఇతర ఉగ్రవాద సంస్థలు దేశ భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ఆర్మీ ఆరోపించింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. టెహ్రాన్‌తో పాటు రష్త్, తబ్రిజ్, షిరాజ్ వంటి నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి, గతంలో తొలగించబడిన రాజరికానికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

అల్ జజీరా నివేదిక ప్రకారం, భద్రతా దళాల చర్యల్లో తొమ్మిది మంది పిల్లలతో సహా కనీసం 51 మంది నిరసనకారులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఈ నిరసనల్లో పాల్గొనేవారిని "దేవుని శత్రువులు" (Enemies of God)గా పరిగణించి మరణ శిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవహెది ఆజాద్ హెచ్చరించారు. 2022 నాటి మహసా అమిని ఉద్యమం తర్వాత దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆందోళనలు ఇవేనని చెబుతున్నారు. మరోవైపు, ఇరాన్ నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతును ప్రకటించారు. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పేదలకు నెలకు 7 డాలర్ల రాయితీని ప్రకటించినప్పటికీ, 40-60 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ముందు అది ఏ మాత్రం సరిపోదని విశ్లేషకులు అంటున్నారు.

Next Story