- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల మాటలు నీటి మూటలేనా? క్రీడా స్థలం లేక ఏన్కూర్ KGBV విద్యార్థుల తిప్పలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

దిశ, ఏన్కూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఏన్కూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV)లో క్రీడా మైదానం లేకపోవడంతో క్రీడలు విద్యార్థినులకు అందని ద్రాక్షలా మారాయి. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 340 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. రోజూ ఉదయాన్నే నిద్రలేచే విద్యార్థినులకు శారీరక దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం. నేర్పించడానికి ఫిజికల్ డైరెక్టర్ (PD) అందుబాటులో ఉన్నప్పటికీ, మైదానం లేకపోవడంతో వ్యాయామ శిక్షణ కాగితాలకే పరిమితమవుతోందని ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఏన్కూర్ పర్యటనకు వచ్చిన అప్పటి జిల్లా కలెక్టర్ గౌతమ్ దృష్టికి పాఠశాల యాజమాన్యం ఈ మైదాన సమస్యను తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. స్థానిక పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పాఠశాల క్రీడా ప్రాంగణంగా కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే, అధికారుల ఉదాసీనత కారణంగా ఆయన ఆదేశాలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకుల మాటలు నీటి మూటలుగా మారడంతో ఏళ్లు గడుస్తున్నా స్థల కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా ప్రస్తుత జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి, పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పాఠశాలకు కేటాయించి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.






