గంభీరావుపేటలో మీసేవ కేంద్రాల్లో అధిక వసూళ్లా..?

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కొన్ని మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వ నిర్ణయించిన రుసుములకు మించి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గంభీరావుపేటలో మీసేవ కేంద్రాల్లో అధిక వసూళ్లా..?
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కొన్ని మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వ నిర్ణయించిన రుసుములకు మించి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ ధ్రువపత్రాలు, దరఖాస్తులు, ఆన్‌లైన్ సేవల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం మీసేవ కేంద్రాన్ని ఆశ్రయించగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.180 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, రూ.350 తీసుకున్నట్లు ఆరోపించారు.

మీసేవ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కొందరు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ సేవలను నిర్ణీత రుసుముతో అందించాల్సిన కేంద్రాలు కొందరికి ఆదాయ వనరుగా మారాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మారుతిరెడ్డిని వివరణ కోరగా, **"మీసేవ కేంద్రాల్లో అధిక వసూళ్ల విషయం నా దృష్టికి వచ్చింది. సంబంధిత బాధితుడు అధికారికంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం"** అని తెలిపారు. అయితే, మీసేవ కేంద్రాలపై వచ్చిన ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.

Next Story