దేవుళ్లను వలస కూలీలంటారా? ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ షాక్ ఇచ్చిన భానుప్రకాశ్‌రెడ్డి

by Malleboina Mahesh |

నటుడు ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం దావా! రామ లక్ష్మణులను ‘వలస కూలీలు’ అన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి.

దేవుళ్లను వలస కూలీలంటారా? ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ షాక్ ఇచ్చిన భానుప్రకాశ్‌రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) హిందూ ఇతిహాసాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల (Controversial comments)పై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి (Bhanuprakash Reddy) కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. రామ లక్ష్మణులు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలంటూ ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తిరుపతి కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, మతపరమైన విశ్వాసాలను అవహేళన చేస్తూ సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా మాట్లాడుతున్న నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భానుప్రకాశ్‌రెడ్డి కోరారు.

రామాయణాన్ని, ఆరాధ్య దైవాలను వలస కూలీలతో పోల్చడం క్షమార్హం కాని నేరమని, దీనిపై ప్రకాశ్‌రాజ్ బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సంస్కృతిని, ధర్మాన్ని కించపరచడం సరికాదని, బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సామాజిక శాంతి దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పరువు నష్టం దావా రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Next Story