PACS కేంద్రాలకు ప్రత్యామ్నాయ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీల నియామకం

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

PACS కేంద్రాలకు ప్రత్యామ్నాయ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి రోజు 14 సంఘాలకు నియమించగా రెండరోజు శుక్రవారం మరో 6 పీఏసీఎస్​లకు కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీ ఆరు నెలలపాటు కానీ ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, ఏది ముందైతే అది వర్తించే విధంగా నియమించడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్, గద్దపాక, పోరండ్ల, వరంగల్ జిల్లా దుగ్గొండి, నాచినపల్లి, నెక్కొండ సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీలను నియమిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. మొదటి రోజు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, తాడికల్ , మెట్ పల్లి , వరంగల్ జిల్లాలోని అమీనాబాద్, ఖానాపూర్, మహ్మదాపూర్, మందపల్లి , సూరిపల్లి , రెడ్లవాడ , చెన్నరావుపేట , గురిజాల , నర్సంపేట, వికారాబాద్ జిల్లాలో కుల్కచర్ల , పరిగి సంఘాలకు నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి ఆయా సహకార సంఘాల నిర్వహణను పర్యవేక్షించనున్నాయని పేర్కొన్నారు.

ఉత్తర్వుల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తికాకముందు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నందున, రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ఇతర సహకార సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీల నియామకం అవసరమని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్ , రిజిస్ట్రార్ ఆయా సహకార సంఘాల పనితీరుపై సమగ్ర పరిశీలన నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా సంఘాల్లో రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం, ఎగవేతదారుల (డిఫాల్టర్ల) జాబితా తయారు చేయకపోవడం, బకాయిల వసూళ్ల కోసం చర్యలు చేపట్టలేదన్నారు. ఆడిట్ అభ్యంతరాలను సరిదిద్దకపోవడం, నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరుకాకపోవడం, పరిపాలనా లోపాలు, సహకార సంఘాల ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత కమిటీలు కొనసాగితే సహకార రుణ వ్యవస్థ లక్ష్యాల అమలు దెబ్బతింటుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది.

Next Story