ఆ రైతుల పోరాటం ఫలించింది.. ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్

by Web Desk |
ఆ రైతుల పోరాటం ఫలించింది.. ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఏపీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ అన్నారు. 807 రోజుల పాటు రైతులు చేస్తున్న ఆందోళనకు హైకోర్టు తీర్పుతో న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని పై త్రిసభ్య ధర్మాసనం వెల్లడించిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్ పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్ పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అప్పగించాలని కోరారు.

అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లను అప్పగించాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలన్నారు. రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖాకు వీల్లేదన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం శిరసా వహించాలని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ సూచించారు.



Next Story

Most Viewed