AP Weather Update : పగలు దంచే ఎండలు.. సాయంత్రం పిడుగుల వానలు

by Muthe.Rajitha |

ఏపీలో రానున్న రెండు రోజులు ఒకవైపు తీవ్ర ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

AP Weather Update : పగలు దంచే ఎండలు.. సాయంత్రం పిడుగుల వానలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో రానున్న రెండు రోజుల్లో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్టు సమాచారం. ఒకవైపు భానుడి భగభగలతో జనం అల్లాడుతుంటే, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అయితే మధ్యాహ్నం తీవ్ర ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే వాతావరణం సాయంత్రానికి వర్షం ఉరుములు, పిడుగులతో గర్జించనుంది. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ పరిసరాల్లో విస్తరించి ఉన్న మరో ఆవర్తనం కారణంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉంది.

ఏపీలో ఎండల తీవ్రత కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. ఆదివారం నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేణిగుంటలో 42.3°C, ఒంటిమిట్టలో 41.5°C, పెదపారుపూడిలో 41.3°C చొప్పున భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతలు ఉండటంతో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్‌ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారు.

ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా, మన్యం ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడవచ్చు. అయితే, వర్షం పడే సమయంలో పిడుగుల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వర్ష సూచన ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత తగ్గదని అధికారులు పేర్కొన్నారు.

Next Story