మరోసారి ఏపీకి బర్డ్ ఫ్లూ గండం... ప్రజల బెంబేలు!

by Muthe.Rajitha |

ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేగింది.

మరోసారి ఏపీకి బర్డ్ ఫ్లూ గండం... ప్రజల బెంబేలు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. అన్నమయ్య జిల్లా సదుం మండలంలో ఇటీవల బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో జిల్లావ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సదుం మండలంలోని అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చనిపోవడం స్థానికంగా భయాన్ని పెంచింది. బర్డ్ ఫ్లూ భయంతో పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

కాగా గత వారం రోజుల వ్యవధిలోనే ఈ గ్రామాల్లో దాదాపు 24 వేల నుంచి 28 వేల వరకు కోళ్లు మృతి చెందాయి అని అధికారులు ధృవీకరించారు. కొన్ని గ్రామాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను పరీక్షల కోసం భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్‌కు పంపగా, వాటిలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనిని కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇది తీవ్రమైన రకమైన బర్డ్ ఫ్లూ అని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను గ్రామాలకు పంపి, మృతి చెందిన కోళ్లను సురక్షితంగా గుంతల్లో పూడ్చారు. బ్లీచింగ్ పౌడర్, సున్నం వంటివి ఉపయోగించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా బతికున్న కోళ్లను కూడా తొలగిస్తున్నారు. పౌల్ట్రీ మార్కెట్లను కట్టుదిట్టంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రజలకు భయపడవద్దని భరోసా ఇస్తున్నారు.

అయితే ఈ ఘటనతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో పెట్టుబడి మొత్తం నష్ట పోయామని ఆవేదన చెందుతున్నారు. సమీప ప్రాంతాల్లో ఎవరికైనా బర్డ్ ఫ్లూ సోకిందా అనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మనుషులకు సోకిన కేసులు ఏవీ నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. కోడి మాంసాన్ని బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. కోళ్లు అకస్మాత్తుగా చనిపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సదుం మండలంలో జరిగిన ఈ బర్డ్ ఫ్లూ ఘటన రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పెద్ద ఔట్‌ బ్రేక్‌లలో ఒకటిగా మారింది. అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అనవసర భయానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story