కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

by Muthe.Rajitha |

కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలను ప్రకటించింది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సాహిత్యం, కళలు, సంస్కృతి, సామాజిక సేవ మరియు ఇతర రంగాలలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా కొనసాగించింది. ఇందులో భాగంగా మొత్తం 164 మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కళారత్న' అవార్డులకు 40 మందిని ఎంపిక చేయగా.. వివిధ రంగాలకు చెందిన మరో 124 మందిని 'ఉగాది విశిష్ట పురస్కారాల'కు ఎంపిక చేశారు.

ఏపీ ప్రభుత్వం అందించే పురస్కారాలలో అత్యున్నత 'కళారత్న' పురస్కారం.. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద కళల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కళాకారులకు దక్కుతుంది. ఈ ఏడాది ఎంపికైన 40 మంది కళారత్న గ్రహీతలలో సీనియర్ కళాకారులతో పాటు యువ ప్రతిభావంతులకు కూడా చోటు కల్పించడం విశేషం. మరోవైపు 124 మందికి ప్రకటించిన ఉగాది పురస్కారాలలో కవులు, రచయితలు, ఆధ్యాత్మిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు ఉన్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉగాది రోజున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పంచాంగ శ్రవణం అనంతరం అత్యంత వైభవంగా జరగనుంది.

Next Story