అసెంబ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలివ్వండి : సీఎస్ రామకృష్ణారావు

by Muthe.Rajitha |

పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలివ్వాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

అసెంబ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలివ్వండి : సీఎస్ రామకృష్ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వివిధ శాఖల కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, సమావేశాల ఏర్పాట్లు, సమాధానాల పురోగతిపై సమీక్షించారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని వివరాలను శనివారం లోగా పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నీటిపారుదల, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, ఇంధన, రెవిన్యూ శాఖలకు సంబంధించి అత్యధికంగా ప్రశ్నలు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని సీఎస్ తెలిపారు. కాగా, సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై ఆదివారం నాడు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story