దావోస్‌లో తెలంగాణ సర్కార్ మరో విజయం.. యూపీసీ వోల్ట్‌‌తో బిగ్ డీల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 08:43:12  IST  )

దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రాన్ని ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ‘తెలంగాణ రైజింగ్’ బృందం ఇవాళ యూపీసీ వోల్ట్ సంస్థతో ఎంవోయూను కుదుర్చుకుంది.

దావోస్‌లో తెలంగాణ సర్కార్ మరో విజయం.. యూపీసీ వోల్ట్‌‌తో బిగ్ డీల్
X

దిశ, వెబ్‌డెస్క్: దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రాన్ని ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ‘తెలంగాణ రైజింగ్’ బృందం ఇవాళ యూపీసీ వోల్ట్ సంస్థతో ఎంవోయూను కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

నెదర్లాండ్స్‌‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్‌ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలంగాణ రైజింగ్ బృందం తెలిపింది.

ఈ సందర్భంగా సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్ లో భాగమని అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story