- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PMJ జ్యువెలరీ దోపిడీ కేసులో మరో ట్విస్ట్.. బీహార్‌లో కీలక నిందితుడి అరెస్ట్!
పీఎంజే జువెలరీ షాప్ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ పూర్తి చేసినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు.

దిశ, కరీంనగర్ లీగల్: పీఎంజే జువెలరీ షాప్ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ పూర్తి చేసినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 3న ఉదయం 11:00 గంటల నుంచి ఆదివారం ఉదయం 10:30 గంటల వరకు ముగ్గురు నిందితుల పోలీసు కస్టడీ కొనసాగిందని ఆయన అన్నారు. A-1 సుబోధ్ సింగ్, A-2 రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్, A-3 రవీష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్‌లను మూడు రోజుల పాటు విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీస్ కస్టడీ సమయంలో పంచుల సమక్షంలో నిందితులను సుదీర్ఘంగా విచారించగా, కీలకమైన ఆయుధాలు, మొబైల్ ఫోన్ రికవరీ అయ్యాయని ఆయన తెలిపారు.
నిందితులు ఏ2 రఘునాథ్ కర్మాకర్, ఏ3 రవీష్ కుమార్ లు ఇచ్చిన సమాచారం మేరకు, వారిని వెంటబెట్టుకుని వెళ్లగా వెలిచాల బైపాస్ రోడ్ వద్ద గల చెట్ల పొదలలో దాచి ఉంచిన, నేరానికి ఉపయోగించిన రెండు పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు తప్పించుకుపోయిన మార్గమైన ధర్మపురి వైపు విచారణ జరపగా, మద్దునూరు గ్రామ పరిధిలోని బగ్గారం మండల అటవీ ప్రాంతం సమీపంలో నేరానికి సంబంధించిన ఒక విఓ కంపెనీ మొబైల్ ఫోన్‌ను గుర్తించి, పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
విచారణలో కొంత సమాచారం సేకరించినప్పటికీ, నిందితులు పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరించలేదని ఆయన పేర్కొన్నారు. దొంగిలించిన సొత్తు (బంగారు,వజ్రాల ఆభరణాలు) ఎక్కడ దాచారు? ఎవరికి విక్రయించారు? ఎవరెవరికి ఆర్థిక లావాదేవీలు జరిగాయి? అనే కీలక సమాచారాన్ని నిందితులు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని అన్నారు. ఆభరణాల దాచివేత, రవాణా విషయాల పై నిందితులు పరస్పర విరుద్ధమైన, తప్పుదారి పట్టించే వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా, గతంలో గుండాల అటవీ ప్రాంతంలో సొత్తు దాచినట్లు చెప్పిన ఏ -2 రఘునాథ్ కర్మాకర్ తమ విచారణలో ఆ సమాచారం అస్పష్టంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించడానికే నిందితులు ఇలా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. ఈ నేపథ్యంలో, నిందితులను మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో ప్రత్యేకంగా రిక్విజిషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి అరెస్ట్..
ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఇందులో భాగంగా పోలీస్ బృందం ఒక భారీ విజయాన్ని సాధించిందని అన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఏ10 గా ఉన్న నిందితుడు అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర సింగ్‌ను బిహార్‌లోని సలింపూర్‌లో పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని అక్కడ స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరిచి, కరీంనగర్‌కు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పొందారని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందం నిందితునితో కలిసి కరీంనగర్‌కు తీసుకు వస్తున్నారని తెలిపారు. ఈ కేసులోని మిగిలిన పరారీ నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.






