దేశంలో మరో ఎబోలా అనుమానిత కేసు కలకలం

by Muthe.Rajitha |

ఆఫ్రికా దేశాలలో తీవ్రంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ముప్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు Health ఎమెర్జెన్సీ ప్రకటించాయి.

దేశంలో మరో ఎబోలా అనుమానిత కేసు కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికా దేశాలలో తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ ముప్పు నేపథ్యంలో భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు ఎమెర్జెన్సీ ప్రకటించాయి. అయితే భారత్‌లో మొదటిసారిగా కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఉగాండా దేశం నుండి వచ్చిన ఒక మహిళలో జ్వరం, తీవ్రమైన శరీర నొప్పులు వంటి ఎబోలా లక్షణాలు కనిపించాయి. అయితే తక్షణమే అప్రమత్తమైన వైద్యాధికారులు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి, నమూనాలను పరీక్షించగా ఎబోలా 'నెగెటివ్' అని తేలడంతో అధికారులు, నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతటితో ఆగకుండా మరికొద్ది గంటల్లోనే గుజరాత్ లో మరో ఎబోలా అనుమానిత కేసు బయటపడటం కలకలం రేపింది. కాంగో దేశం నుండి గుజరాత్‌కు వచ్చిన ఒక వ్యాపారవేత్తతో పాటు మరో ముగ్గురిలో ఎబోలా వైరస్ తరహా సస్పెక్టెడ్ లక్షణాలు కనిపించడంతో గుజరాత్ ప్రభుత్వం వారిని అహ్మదాబాద్‌లోని వేర్వేరు ఆసుపత్రులలో ఐసోలేషన్‌లో ఉంచింది.

వారి రక్త నమూనాలను సేకరించి నిర్ధారణ పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపినట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పాన్షేరియా అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఎక్కడా కూడా ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాలలో ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్నందున, అంతర్జాతీయ విమానాశ్రయాలలో స్క్రీనింగ్ ప్రక్రియను, ఆయా దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై ట్రావెల్ అడ్వైజరీలను కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా అమలు చేస్తోంది.

Next Story