ఎర్రకోట పేలుళ్ళ కేసు.. వెలుగులోకి మరో కొత్త టెర్రరిస్ట్ గ్రూప్

by Muthe.Rajitha |

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు కేసులో మరో కొత్త టెర్రరిస్టు గ్రూప్ ఉన్నట్టు NIA గుర్తించింది.

ఎర్రకోట పేలుళ్ళ కేసు.. వెలుగులోకి మరో కొత్త టెర్రరిస్ట్ గ్రూప్
X

దిశ,వెబ్ డెస్క్ : ఢిల్లీ ఉగ్రపేలుడు కేసు దర్యాప్తులో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టైన అనుమానితులు కలిసి "అన్సార్ ఇంటీరియం" పేరిట కొత్త తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసినట్లు NIA అధికారులు పేర్కొన్నారు. వీరిలో ముజమ్మిల్ గన్నీ, ఉమర్ నబీ, ఆదిల్, ముజఫర్, మౌల్వీ ఇర్ఫాన్, కారీ ఆమిర్, తౌఫిల్ గాజీలు ఉన్నారు. 2022 ఏప్రిల్‌లో శ్రీనగర్‌లో సమావేశమై ఈ సంస్థను ప్రారంభించినట్లు విచారణలో తేలింది. ఆదిల్‌ను చీఫ్‌గా నియమించగా, మౌల్వీ ఇర్ఫాన్‌కు డిప్యూటీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. సంస్థలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బాధ్యతలు కేటాయించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉమర్ సమన్వయకర్తగా వ్యవహరించగా, గన్నీ ఆర్థిక వ్యవహారాలు మరియు కొనుగోళ్లు చూసేవాడని వెల్లడించారు.

ఈ గ్రూప్ 2023లో పేలుళ్లకు అవసరమైన మెటీరియల్, ఎరువులను హర్యానాలోని సోహ్న ప్రాంతం నుంచి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అదేవిధంగా, ఫరీదాబాద్‌లోని ఒక కెమికల్ దుకాణం నుంచి పొటాషియం నైట్రేట్ తెప్పించినట్లు గుర్తించారు. ఉమర్ ఆన్‌లైన్ వీడియోలను ఆధారంగా చేసుకుని ఐఈడీలు (IEDలు) తయారు చేయడం నేర్చుకున్నాడని విచారణలో వెల్లడైంది. ఆత్మహుతి దాడులకు కూడా ప్లాన్ చేసినప్పటికీ.. చివరి నిమిషంలో విరమించుకున్నట్టు సమాచారం. NIA ప్రకారం.. ఈ గ్రూపులో ఉమర్ అత్యంత రద్దీ ప్రాంతంలో శక్తివంతమైన బాంబు పేల్చాలని కుట్ర పన్నినట్లు విచారణలో బయటపడింది.

శ్రీనగర్ పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడంతో ఉమర్ తీవ్ర ఆందోళనకు గురై, అనంతరం దిల్లీలో పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. గతంలో 2016, 2018 సంవత్సరాల్లో కూడా ఉగ్ర సంస్థల్లో చేరేందుకు ప్రయత్నించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. మొత్తం కేసుపై ఎన్‌ఐఏ మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. కాగా ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు కేసులో మరో కొత్త టెర్రరిస్టు గ్రూప్ ఉన్నట్టు NIA గుర్తించింది. గత నవంబరులో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కారుబాంబుతో అత్మహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15 మంది మృతి చెందగా.. 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

Next Story