- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయిలో సింగరేణికి మరో ఘనత
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి ఉత్తమ గనుల ఎంపికలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) మరో ప్రతిష్ఠాత్మక ఘనతను సొంతం చేసుకుంది.

దిశ, కొత్తగూడెం సింగరేణి : కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి ఉత్తమ గనుల ఎంపికలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) మరో ప్రతిష్ఠాత్మక ఘనతను సొంతం చేసుకుంది. 2024–25 సంవత్సరానికి గాను సంస్థకు చెందిన ఐదు గనులు అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ సాధించి దేశవ్యాప్తంగా ఉత్తమ గనుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈసారి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే న్యూటెక్, ఆర్‌కే-6, సత్తుపల్లి ఏరియాలోని జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్, రామగుండం-3 ఏరియాలోని ఆర్‌జీ ఓసీ-1 గనులు 5-స్టార్ రేటింగ్ సాధించాయి. దేశవ్యాప్తంగా 382 గనులు దరఖాస్తు చేయగా, కేవలం 50 గనులు మాత్రమే ఈ అత్యున్నత గుర్తింపుకు ఎంపికయ్యాయి. వాటిలో ఐదు గనులు సింగరేణివే కావడం విశేషం. గత ఏడాది నాలుగు గనులు మాత్రమే ఈ గుర్తింపు పొందగా, ఈసారి ఐదు గనులు ఎంపిక కావడం సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా నిలిచింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులు, సిబ్బందిని అభినందించారు. రక్షణ ప్రమాణాలు, కార్మిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో ఈ గనులు ఆదర్శంగా నిలిచాయని పేర్కొంటూ, ఇతర గనులు కూడా వీటిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేంద్ర బొగ్గు శాఖ అనుబంధ సంస్థ కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రేటింగ్ ప్రక్రియలో గనుల పనితీరు, సాంకేతికత, భద్రత, పర్యావరణ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యత తదితర ఏడు విభాగాల్లోని 50 ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం నిర్వహిస్తారు. నిపుణుల బృందం ప్రత్యక్షంగా గనులను పరిశీలించిన అనంతరం 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు 5-స్టార్ రేటింగ్ ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా, ఈసారి సింగరేణికి చెందిన మరో 17 గనులు 4-స్టార్ రేటింగ్ సాధించాయి. స్వల్ప మార్కుల తేడాతో అవి 5-స్టార్ రేటింగ్‌ను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సింగరేణిలో అమలవుతున్న రక్షణ ప్రమాణాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు, సమర్థవంతమైన గని నిర్వహణకు ఈ గుర్తింపులు నిదర్శనమని సంస్థ అధికారులు పేర్కొన్నారు.






