- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలపై లైంగిక దాడిని దాచడం నేరమే: సుప్రీంకోర్టు
పోక్సో కేసుల్లో ప్రైవేట్ విచారణలు కుదరవని, చిన్నారి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులకు తెలపడం చట్టపరమైన విధి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లలపై జరిగే లైంగిక దాడుల నిరోధక చట్టం (పోక్సో - POCSO) అమలుపై సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది. పిల్లలపై లైంగిక దాడిని దాచడం నేరమేనని స్పష్టం చేసింది. పోక్సో చట్టం కింద ఒక చిన్నారి తనపై జరిగిన లైంగిక దాడి గురించి నేరుగా ఎవరికైనా ఫిర్యాదు చేస్తే దానిపై సొంతంగా విచారణలు జరుపుతూ కాలయాపన చేయడానికి ఎవరికీ హక్కు లేదని, పోలీసులకు వెంటనే సమాచారం అందించడం చట్టపరమైన విధి అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అసోంలోని గువాహటిలోని ఓ పాఠశాల ప్రధాన్యోపాధ్యాయురాలిపై క్రిమినల్ విచారణను పునరుద్ధరిస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆమెను విచారణ నుంచి విముక్తి చేస్తూ ట్రయల్ కోర్టు, గౌహతి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏం జరిగిందంటే..?
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సదరు పాఠశాలలో చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై ఓ సీనియర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ చిన్నారి తన అక్కకు, స్కూల్ హెడ్ గర్ల్‌కు, చివరకు ప్రధానోపాధ్యాయురాలికి తెలియజేసింది. అయితే పోక్సో చట్టం ప్రకారం వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు ఆ పని చేయకుండా సొంతంగా ధృవీకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. బాలిక ప్రైవేట్ భాగాలను స్వయంగా పరీక్షించడంతో పాటు అఘాయిత్యం జరిగినట్లు స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఏమీ జరగలేదని తేల్చేసింది. ఆపై పోలీసులకు సమాచారం ఇవ్వకపోగా, ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టవద్దని మిగతా విద్యార్థులను ఆదేశించింది.
ప్రైవేట్ విచారణలకు తావు లేదు: సుప్రీంకోర్టు
విచారణ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలి వాదనను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం బాధితురాలైన చిన్నారి నుంచి నేరుగా సమాచారం అందినప్పుడు సదరు వ్యక్తికి ఆ నేరం గురించి సమాచారం/జ్ఞానం ఉన్నట్లే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిందని సమాచారం ఉన్నప్పుడు ఎవరికి వారు సొంతంగా ఎంక్వైరీలు చేసుకుంటూ కూర్చుంటే పోక్సో చట్టం యొక్క ఉద్దేశమే దెబ్బతింటుందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనివల్ల కీలకమైన ఆధారాలు మాయమయ్యే ప్రమాదం ఉందని, దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నేరం జరిగిందా లేదా అనేది నిర్ధారించాల్సింది పోలీసుల దర్యాప్తులోనే కానీ అంతకంటే ముందే ప్రైవేట్ వ్యక్తులు నిజానిజాలు తేల్చడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది.






