నానక్‌రాంగూడ వద్ద ఆసక్తికరమైన దృశ్యం.. ఆ ఇంటి వద్ద యువకుల భారీ క్యూ

by Batti.Sumithra |

నానక్‌రాంగూడ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద యువకులు భారీ లైన్‌లో నిలబడ్డారు.

నానక్‌రాంగూడ వద్ద ఆసక్తికరమైన దృశ్యం.. ఆ ఇంటి వద్ద యువకుల భారీ క్యూ
X

దిశ, సిటీ క్రైమ్ : నానక్‌రాంగూడ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద యువకులు భారీ లైన్‌లో నిలబడ్డారు. కానీ ఆ ఇంటికి తాళం ఉంది. అయినా యువకులందరూ క్యూలో నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత వారందరూ పోలీసుల అదుపులోకి వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లిపోయారంటే.. ఇది చదవాల్సిందే. హైదరాబాద్ నానక్‌రాంగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న నీతుభాయి గత కొంతకాలంగా గంజాయి అమ్ముతూ అక్రమ దందా చేస్తోంది. ఐటీ ఉద్యోగాలు చేసే యువకులతో పాటు మిగతా వారు కూడా ఆమె దగ్గర గంజాయిని కొనుగోలు చేస్తూ మత్తులోకి దిగుతున్నారు. ఈ విషయం తెలిసి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాలతో పోలీసులు బుధవారం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.

బుధవారం నీతుభాయి ఇంటికి తాళం ఉన్నా దాదాపు 32 మంది యువకులు అక్కడ లైన్‌లో నిలబడ్డారు. వారందరూ కూడా గంజాయి కోసం ఆ ఇంటితాళం ఎప్పుడు తెరుచుకుంటుందో ఎదురుచూస్తున్నారు. ఇంతలో రంగంలోకి దిగిన ఈగల్ అధికారులు వారందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారందరికీ కూడా డ్రగ్స్ టెస్టులు చేసేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో నీతుభాయిని అరెస్టు చేసి దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. అయినా తీరు మార్చుకోని నీతుభాయి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా గంజాయి అమ్ముతున్నట్లు ఈ డెకాయ్ ఆపరేషన్‌లో తేలింది. నీతుభాయి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

Next Story