- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీ వేగం.. 433 పోస్టులకు ఎంపిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చడంతో పాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చడంతో పాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లలోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బుధవారం బోర్డు విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోని 34 విభాగాలకు చెందిన మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవలే నియామక పత్రాలను అందజేశారు.
తాజాగా మిగిలిన 30 డిపార్ట్‌మెంట్లలో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు, సెలక్షన్ లిస్టును ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ జాబితాను కూడా బోర్డు విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పీచ్ పాథాలజిస్టులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక పత్రాలను అందజేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్, ఇతర ఆరోగ్య సంస్థల్లో మానవ వనరులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిధిలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. ఇందులో ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది తదితర విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.






