- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీఓ స్వప్న అక్రమాల పై విచారణ జరపాలి
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నల్గొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ (ఆర్సీఓ) ఈ. స్వప్న అక్రమాలు, అరాచకాలపై జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.

దిశ, దేవరకొండ టౌన్ : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల నల్గొండ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ (ఆర్సీఓ) ఈ. స్వప్న అక్రమాలు, అరాచకాలపై జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమె వ్యవహారశైలిపై మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో సొసైటీ సెక్రటరీ బడుగు సైదులు, ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమయాదేవికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుమారు రెండు పేజీల అక్రమాలు, అవినీతికి సంబంధించిన వివరాలతో కూడిన ఫిర్యాదు లేఖను వారికి అందజేసి, అనంతరం మీడియాకు విడుదల చేశారు.
అహంకార ప్రవర్తన.. సీట్ల భర్తీలో కుట్రలు
ఈ సందర్భంగా డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలోని బీసీ గురుకులాల ఇంటర్మీడియట్ సీఈసీ (CEC) గ్రూపులో కావాలనే సీట్లను భర్తీ చేయకుండా ఆర్సీఓ స్వప్న కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్ల ప్రక్రియలో ఎలాంటి పారదర్శకత పాటించడం లేదని, వివరాలు అడిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమోల పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని, బీసీ గురుకులాల్లోనే పనిచేస్తూ బీసీలపట్లే కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె తీరును ప్రశ్నిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, కనీసం ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు.
వారం రోజుల్లో సస్పెండ్ చేయాలి..
తమ ఫిర్యాదును సొసైటీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నిశితంగా పరిశీలించి, వారం రోజుల్లో ఆర్సీఓ స్వప్నపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒకవేళ వారం రోజుల్లోగా ఆమెను సస్పెండ్ చేయకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.






