హైదరాబాద్‌లో వినూత్న ప్రయోగం.. ఫ్లై ఓవర్ల కింద నూతన సబ్‌స్టేషన్లు

by Batti.Sumithra |

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా టీజీఎస్పీడీసీఎల్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లో వినూత్న ప్రయోగం.. ఫ్లై ఓవర్ల కింద నూతన సబ్‌స్టేషన్లు
X

దిశ, రాంనగర్ : హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా టీజీఎస్పీడీసీఎల్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. నగరంలోని ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జీఎస్టీ ప్రాంతంలోని నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేయనున్న సబ్‌స్టేషన్ స్థలాన్ని ఆయన విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వినూత్న ఆలోచనకు టీజీ ఎస్పీడీసీఎల్ ఇంజనీర్లు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలతో నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఈ సబ్‌స్టేషన్ల నిర్మాణం వల్ల ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్లపై లోడ్ తగ్గడంతో పాటు, కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం నగరంలో ఐదు చోట్ల ఫ్లై ఓవర్ కింద అనువైన స్థలాలను గుర్తించామని, త్వరలోనే సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈ (టెక్నికల్) శ్రీనాథ్, ఏడీఈ (మాస్టర్ ప్లాన్) సంజయ్, ఏఈ కౌశిక్, ఏడీఈ (సివిల్) కర్మాకర్ రెడ్డి, ఏఈలు శేఖర్, శ్రీధర్, సిద్ధార్థ్, భవాని, ఏఈ (సివిల్) శ్రీనివాస్ రెడ్డి, డీఈ ఆజాంబాద్ వినోద్ కుమార్, ఏడీఈ సీఆర్డీ నాగేశ్వరరావు, ఏడీఈ ఐఎంఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story