- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి తగాదాలలో సొంత తల్లిదండ్రులపై దాడి
ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులపైనే కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్న ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో వెలుగుచూసింది.

దిశ, మిర్యాలగూడ రూరల్: ఆస్తి కోసం కన్నతల్లిదండ్రులపైనే కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్న ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో వెలుగుచూసింది. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు తమకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచినట్లు తెలిపారు. అయితే వృద్ధాప్యంలో తమ వైద్య ఖర్చుల కోసం ఉంచుకున్న మూడు ఎకరాల 11 గుంటల భూమిని తమను చూసుకుంటున్న మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో.. ఆ భూమిలోనూ వాటా కావాలని పెద్ద కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు తమను వేధిస్తున్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. గతంలో వీల్‌చైర్‌లో ఉన్న తనపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినప్పటికీ.. వేధింపులు మాత్రం ఆగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...
కేసును ఉపసంహరించుకోవాలని, లేకపోతే ట్రాక్టర్‌తో తొక్కిస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వేములపల్లి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే తమ ఫిర్యాదుపై స్పందించాల్సిన వేములపల్లి ఎస్‌ఐ తమపైనే దురుసుగా వ్యవహరిస్తూ బూతులు తిట్టారని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఒకవైపు కుమారుడు, కుటుంబ సభ్యుల వేధింపులు.. మరోవైపు పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు మిర్యాలగూడ ఆర్డీవోను ఆశ్రయించారు. తమకు తక్షణమే ప్రాణ రక్షణ కల్పించి, తమను వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం జరగని పక్షంలో ‘కారుణ్య మరణానికి’ అనుమతి ఇవ్వాలని కోరడం కలకలం రేపింది. వృద్ధ దంపతుల ఫిర్యాదుపై అధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.






