- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుక్కి మొదట్లోనే జేబులు ఖాళీ.. ఎకరాకు రూ.8 వేల అదనపు భారం!
ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటుంటే.. మురిసిపోవాలో, మార్కెట్‌లో ధరల మంట చూసి కన్నీరు పెట్టాలో తెలియని విచిత్రమైన సంక్షోభంలో పడ్డాడు కామారెడ్డి జిల్లా రైతన్న.

దిశ,తాడ్వాయి: ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటుంటే.. మురిసిపోవాలో, మార్కెట్‌లో ధరల మంట చూసి కన్నీరు పెట్టాలో తెలియని విచిత్రమైన సంక్షోభంలో పడ్డాడు కామారెడ్డి జిల్లా రైతన్న. ప్రతి ఏటా తొలకరి పలకరింపుతో ఎంతో ఆశతో పొలం గట్టు ఎక్కే అన్నదాతకు, ఈసారి సాగు ప్రారంభంలోనే కష్టాల సుడిగుండం స్వాగతం పలుకుతోంది. నాగలి పట్టకముందే.. విత్తనం నేల తాకకముందే.. ధరల రూపంలో వచ్చిన పెద్ద గుదిబండ రైతన్న నడ్డి విరుస్తోంది.
డీజిల్ సెగ.. చుక్కలు చూపిస్తున్న ట్రాక్టర్లు
ఒకప్పుడు ఎడ్ల నాగళ్లతో సాగిన వ్యవసాయం.. కాలంతో పాటు మారి ట్రాక్టర్ల వైపు మళ్ళింది. కానీ, నేడు అదే ట్రాక్టర్లు రైతుకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. లీటర్ డీజిల్ రేట్లు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు దుక్కుల రేట్లను భారీగా పెంచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి గంట దుక్కి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక ఎకరా పొలాన్ని పగడ్బందీగా సిద్ధం చేయాలంటే కనీసం మూడు నుండి నాలుగు సార్లు దున్నాల్సి ఉంటుంది. దీంతో కేవలం పొలం దున్నడానికే వేల రూపాయలు ఖర్చవుతుంది. పొలంలో విత్తనం పడకముందే జేబులు ఖాళీ అవుతుంటే.. ఇక పంట ఎలా పండించాలి? అని చిన్న, సన్నకారు రైతులు దిక్కుతోచని స్థితిలో ప్రశ్నిస్తున్నారు.
ధరల మంట.. అప్పుల వేటలో అన్నదాత
దుక్కి ఖర్చులు ఒకెత్తయితే.. మార్కెట్‌లో విత్తనాలు,ఎరువుల ధరలు విమాన వేగంతో దూసుకుపోతున్నాయి. బస్తా ఎరువుల ధరలు చూసి రైతు గుండె గుభేల్‌మంటోంది. నకిలీల భయం ఒకవైపు వెంటాడుతుంటే, అసలైన విత్తనాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూలీల రేట్లు, రవాణా ఖర్చులు కూడా తోడవడంతో.. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రతి ఎకరాకు వేల రూపాయల అదనపు భారం పడుతోంది. ఐదెకరాలు ఉన్న సామాన్య రైతుకు సాగు మొదట్లోనే భారీగా అదనపు పెట్టుబడి కావాలి. గతేడాది కంటే ఎకరాకు సుమారు రూ 8,000 అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి బ్యాంకులు సకాలంలో ఇవ్వకపోవడంతో.. రైతన్నలు మళ్లీ ఊళ్లల్లో ఉండే ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోయి రెక్కలు తెగేలా మీటర్ వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడానికి క్యూ కడుతున్నారు.అన్నం పెట్టే చేతికి సాగుకు ముందే అప్పుల బేడీలు పడుతున్నాయి.
ఇంత చేసినా కాలం కనికరిస్తుందా?.. ప్రకృతి పైనే ఆశలు
ధరలు పెరిగినా నడ్డి విరిచే వడ్డీలకు అప్పులు తెచ్చినా, భూమిని నమ్ముకొని సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఇంకో పెద్ద భయం మదిని తొలిచేస్తోంది. తీరా ఇంత సాహసం చేసి పంట వేసినా.. ప్రకృతి కనికరిస్తుందా..? అన్నదే ఆ ఆందోళన. సకాలంలో వానలు పడతాయా..? లేదా ఎండలు ముదిరి మొలకలు ఎండిపోతాయా? ఒకవేళ వానలు పడ్డ.. కోతలకు వచ్చే టైమ్‌లో తుఫాన్లు, అకాల వర్షాలు వచ్చి పంటను నీలపాలు చేస్తాయా? ఈ వాతావరణ భయం రైతులను రాత్రిళ్లు నిద్రపోనివ్వడం లేదు. ప్రకృతి గనుక కరుణించకపోతే, తమ రెక్కల కష్టం మట్టిపాలై, పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయి రోడ్డున పడటం ఖాయమని రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు. అంతా దేవుడిపైనే భారం వేసి సాగు వేటలో పడ్డారు.
వ్యవసాయం అంటేనే భయమేస్తుంది: యువ రైతు మంత్రి శ్యామ్(అర్గోoడ )
నాకున్న ఐదు ఎకరాల్లో పంట వేద్దామని చూస్తున్నా.. దున్నుకాలు, విత్తనాలు, ఎరువుల బస్తాల ధరలు చూస్తేనేమో గుండె ఆగుతోంది. ట్రాక్టర్ల వాళ్లు రేట్లు భారీగా పెంచేశారు. ఎకరాకు పెట్టుబడి మునుపటి కంటే చాలా ఎక్కువయ్యేలా ఉంది. ఇంత కష్టపడి అప్పులు తెచ్చి పంట వేస్తే,రేపు వానలు పడక పంట ఎండిపోతే మా పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మమ్మల్ని మానవీయ కోణంలో ఆదుకోవాలి.వాతావరణ మార్పుల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వమే ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించాలి.
సొంత భూమి ఉన్నోళ్లకే భారమైతే.. మా బతుకులు మరీ దారుణం: కౌలు రైతు పని గంగాధర్(తాడ్వాయి)
సొంత భూమి ఉన్నోళ్లకే పెట్టుబడులు భారమైతే.. ఇక మాలాంటి కౌలు రైతుల బతుకులు మరీ దారుణం. ఎకరాకు ముందే వేల రూపాయలు కౌలు చెల్లించాలి.ఇప్పుడు పెరిగిన దుక్కుల రేట్లు,ఎరువుల ధరలు చూస్తుంటే గుండె ఆగిపోయేలా ఉంది.బ్యాంకులు మాకు రుణాలు ఇవ్వవు, అంతా ప్రైవేట్ వడ్డీల మీదే నడవాలి. ఇంతా చేసి రాత్రింబవళ్లు కష్టపడి పంట పండిస్తే, రేపు ప్రకృతి కాటేస్తే మాకు రూపాయి బీమా కూడా రాదు. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులను కూడా మానవీయ కోణంలో ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






