'అమ్మా బైలెల్లి నాదో...' అంటూ మార్మోగిన భిక్కనూరు

by Ratna Kumari |

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అమ్మా బైలెల్లి నాదో... అంటూ మార్మోగిన భిక్కనూరు
X

దిశ, భిక్కనూరు : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, డీజే సౌండ్‌కు యువకుల నృత్యాలు, బాణసంచా మధ్య బోనాల ఊరేగింపు వైభవంగా సాగింది. మున్నూరు కాపు సంఘం, నాయి బ్రాహ్మణ సేవా సంఘం, కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన వీధుల గుండా సాగిన బోనాల ఊరేగింపు సుభాష్ చౌరస్తా మీదుగా ఊరడమ్మ ఆలయం వద్దకు చేరుకుని, అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని మహంకాళి అమ్మవారు, భూలక్ష్మమ్మ ఆలయాలకు చేరుకుంది.

అక్కడ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఆయా సంఘాల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు కూడా సంప్రదాయబద్ధంగా బోనాల సమర్పణ నిర్వహించారు. బోనాల పండుగ సందర్భంగా భిక్కనూరు పట్టణమంతా ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో కళకళలాడింది.

Next Story