"బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడతావు".. పెమ్మసానిపై అంబటి ఫైర్

by Muthe.Rajitha |

YSRCP మాజీ మంత్రి అంబటి రాంబాబు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పై చేసిన ఘాటు ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.

బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడతావు.. పెమ్మసానిపై అంబటి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన ఘాటు ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అంతకముందు పెమ్మసాని చేసిన వ్యాఖ్యలపై అంబటి ఫైర్ అయ్యారు. అసలు ఈ మాటల యుద్ధం ఎక్కడ మొదలైందంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో మిట్టల్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. చంద్రబాబు నాయుడు తన "సుందర ముఖారవిందాన్ని" చూపిస్తూ అనవసరపు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ.. తాము "ఒక్క మాటతో చంపేయగలం" అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పెమ్మసానిని నేరుగా రౌడీతో పోలుస్తూ.. "మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని.. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త!" అంటూ అత్యంత ఘాటుగా ట్వీట్ చేశారు.

ఈ ఇద్దరు నేతల మధ్య గతంలో కూడా తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో అంబటి వ్యాఖ్యలపై స్పందిస్తూ "అసలైన సినిమా చూపిస్తాం" అని, "భయపడేలా ట్రీట్‌మెంట్ ఇస్తాం" అని వార్నింగ్ ఇవ్వడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అంబటి రాంబాబు తాజా ట్వీట్ తర్వాత సోషల్ మీడియా వేదికగా టీడీపీ మరియు వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధం మొదలైంది. ఇరు పార్టీల సానుభూతిపరులు ఒకరిపై ఒకరు కౌంటర్ ట్వీట్లు, సెటైరికల్ వీడియోలు మరియు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. పెమ్మసాని గతంలో అమెరికాలో స్థిరపడిన వైద్యుడు కావడంతో, అంబటి ఆయనను ఉద్దేశించి "అమెరికాలో పడతావ్" అని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే వ్యక్తిగత మూలాలను దెబ్బతీసే విధంగా సాగుతున్న ఈ విమర్శలు రాజకీయ స్థాయిని దిగజార్చుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story