అమ్మాయిలకు అమెజాన్ బంపర్ ఆఫర్

by Muthe.Rajitha |

మహిళా ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెజాన్ ఇండియా 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్' ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

అమ్మాయిలకు అమెజాన్ బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని తక్కువ ఆదాయ నేపథ్యం ఉన్న మహిళా ఇంజినీరింగ్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్' (AFE) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కాలర్‌షిప్‌లు అందుకున్న అమ్మాయిలు MNC కంపెనీల్లో భారీగా పొందటంతో ఇదే ఊపులో అమెజాన్ ఈ ప్రోగ్రాంను భారీగా విస్తరించింది. 2026 విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 500 స్కాలర్‌షిప్‌లను ప్రకటిస్తూ, మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 2,200కు పెంచింది. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థినులకు నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్య కోసం రూ. 2 లక్షల ఆర్థిక సహాయంతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.

4.8 మిలియన్ల మంది అమ్మాయిలకు చేరువ

అమెజాన్ ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ కోసం 2022 నుండి ఇప్పటివరకు సుమారు రూ. 50 కోట్లు వెచ్చించింది. కేవలం ఇంజినీరింగ్ విద్యార్థులే కాకుండా, దేశవ్యాప్తంగా 50 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 4.8 మిలియన్ల మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అవగాహన కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. బీఈ/బీటెక్ లోని కంప్యూటర్ సైన్స్ అనుబంధ విభాగాలు చదువుతున్న పేద విద్యార్థినులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయంతో పాటు చదువుకు అవసరమైన ల్యాప్‌టాప్‌లను కూడా అమెజాన్ సమకూరుస్తుంది. అమెజాన్ ఇంజినీర్ల ద్వారా ప్రత్యక్ష గైడెన్స్, బూట్‌క్యాంప్‌ల ద్వారా సాంకేతిక శిక్షణ, 'అమెజాన్ విమెన్ ఆఫ్ ది వరల్డ్' (WoW) ద్వారా వెబినార్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థినులు అమెజాన్‌లో ఎనిమిది వారాల పాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం పొందుతారు. ఇది వారికి కార్పొరేట్ పనితీరుపై అవగాహన కల్పిస్తుంది.

ప్లేస్‌మెంట్లలో సత్తా చాటిన తొలి బ్యాచ్

2025లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఈ పథకం మొదటి బ్యాచ్ విద్యార్థినులు అద్భుత ఫలితాలను సాధించారు. ఏకంగా 89 శాతం మంది విద్యార్థినులు అమెజాన్‌తో పాటు పలు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్నారు. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలకు చెందిన వారు, తమ కుటుంబంలోనే తొలిసారిగా కాలేజీ విద్యను అభ్యసించిన (First-generation graduates) వారు ఈ విజయాల్లో ముందుండటం విశేషం. ఈ విజయాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోగ్రాం ద్వారా మరింత మంది అమ్మాయిలకు అండగా నిలిచేందుకు ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లను మరో 500 వరకు పెంచింది అమెజాన్.

Next Story