లోకేష్ పిలుపు.. అమరావతికి హారతులు

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభలలో చట్టబద్ధత లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని హారతి దీపోత్సవం అంబరాన్నంటింది.

లోకేష్ పిలుపు.. అమరావతికి హారతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభలలో చట్టబద్ధత లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని, గురువారం రాత్రి అమరావతిలో హారతి దీపోత్సవం అంబరాన్నంటింది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, హారతులు ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ బిల్లు ఆమోద విజయాన్ని ఐదు కోట్ల ఆంధ్రుల విజయంగా అభివర్ణించిన లోకేశ్, అమరావతి రైతులకు పట్టిన 'గ్రహణం వీడిందని' అన్నారు. వారి ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు, త్యాగానికి తగిన ప్రతిఫలం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా #APThanksIndia హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుండగా, ప్రజలు తమ ఇళ్ల ముందు వెలిగించిన దీపాల ఫోటోలను, సెల్ఫీలను పెద్ద ఎత్తున పంచుకుంటూ తమ సంతోషాన్ని చాటుకున్నారు.

ముఖ్యంగా అమరావతి పరిధిలోని గ్రామాలతో పాటు గుంటూరు, విజయవాడ, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఈ వేడుకలు మిన్నంటాయి. రాత్రి 7 గంటల సమయంలో వీధులన్నీ దీపాల కాంతులతో జిగేల్మన్నాయి. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందడం వల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని స్థితిని అంత సులభంగా మార్చడం సాధ్యం కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడులకు ఒక కీలక మలుపుగా నిలవనుంది. తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు ఈ ఘనతను తమ ప్రభుత్వ దౌత్య, రాజకీయ విజయంగా చూస్తుండగా, సామాన్య ప్రజలు సైతం రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయినందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Next Story