మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-29 09:25:31  IST  )

కష్టాల్లో ఉన్న స్నేహితుడిని చూసి ఆ పాత జ్ఞాపకాల మిత్రుల హృదయాలు స్పందించాయి.

మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు
X

దిశ,బూర్గంపాడు: కష్టాల్లో ఉన్న స్నేహితుడిని చూసి ఆ పాత జ్ఞాపకాల మిత్రుల హృదయాలు స్పందించాయి. మేమున్నామంటూ భరోసా ఇస్తూ.. ఆర్థికంగా,నైతికంగా అండగా నిలిచి నిజమైన స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన చెలికాని ప్రవీణ్ జూన్ 9న జరిగిన ఒక ద్విచక్ర వాహన ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్లి, ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.​ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన చిన్ననాటి స్నేహితులు ముందుకొచ్చారు.

1999-2000 విద్యాసంవత్సరంలో భద్రాచలం కొర్రాజుల గుట్ట స్కూల్‌లో ప్రవీణ్‌తో కలిసి 10వ తరగతి చదువుకున్న స్నేహితులు అందరూ సోమవారం సారపాక లోని ప్రవీణ్ నివాసానికి తరలివచ్చారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకుని, ప్రవీణ్‌ను పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.55 వేల నగదుతో పాటు, సుమారు రూ. 15 వేలు విలువచేసే మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.​ అదేవిధంగా, 1997-1998 విద్యాసంవత్సరంలో సారపాక గవర్నమెంట్ స్కూల్‌లో ప్రవీణ్‌తో కలిసి 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సైతం స్పందించి, అతనికి తోడ్పాటుగా రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదంలో ప్రవీణ్ తన కుమారుడిని కోల్పోవడం, తను కూడా తీవ్ర గాయాల పాలు కావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టకాలంలో ప్రవీణ్ కుటుంబానికి తమ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రవీణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడని వారు పేర్కొన్నారు.​ ఈ సహాయ కార్యక్రమాల్లో స్నేహితులు సత్రాల రమేష్, గున్నేపల్లి రాజు, తిరుక్కోవళ్ళూరి శేషగిరి, వేముల దుర్గారావు, ఆచంటి పురుషోత్తం, గుమ్మడి మురళి, రౌతు కోటేశ్వరరావు, పతకమూడి లక్ష్మణ్, సిద్ధి రాజులతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story