కేశవాపురంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ తాళాల ధ్వంసం ఆరోపణలు

by Ratna Kumari |

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేశవాపురం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో హుండీ తాళాలను ఒక వర్గానికి చెందిన వారు ధ్వంసం చేశారంటూ మరో వర్గం ఆరోపించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

కేశవాపురంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ హుండీ తాళాల ధ్వంసం ఆరోపణలు
X

దిశ, తల్లాడ : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేశవాపురం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో హుండీ తాళాలను ఒక వర్గానికి చెందిన వారు ధ్వంసం చేశారంటూ మరో వర్గం ఆరోపించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. జూలై 3న ఆలయ వార్షికోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, గత రెండు సంవత్సరాల క్రితం ఆలయ నిర్వహణ, హుండీ వ్యవహారంపై గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పట్లో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని ఉభయ వర్గాల సమక్షంలో హుండీకి రెండు వేర్వేరు తాళాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్షికోత్సవ సమయంలో రెండు వర్గాలు కలిసి హుండీ తెరవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ఆదివారం ఒక వర్గం తమే హుండీ తెరుస్తామని గ్రామంలో చాటింపు వేయించిందని, అనంతరం హుండీ తాళాలను ధ్వంసం చేసిందని మరో వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వార్షికోత్సవానికి ముందే ఇటువంటి పరిణామం చోటుచేసుకోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు గ్రామస్థులు తల్లాడ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వార్షికోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు పోలీసు అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై తల్లాడ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఎస్సై బానోత్ వెంకటేష్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదని తెలిసింది.

Next Story