టీజీఈఏపీసెట్ వెరిఫికేషన్ కేంద్రాల్లో అవస్థలు : గంటల తరబడి నిరీక్షణ

by Batti.Sumithra |   (  Updated:2026-06-28 16:50:40  IST  )

టీజీఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలు (హెల్ప్‌లైన్ సెంటర్లు) సమస్యల నిలయాలుగా మారాయి.

టీజీఈఏపీసెట్ వెరిఫికేషన్ కేంద్రాల్లో అవస్థలు : గంటల తరబడి నిరీక్షణ
X

దిశ, కార్వాన్ : టీజీఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలు (హెల్ప్‌లైన్ సెంటర్లు) సమస్యల నిలయాలుగా మారాయి. ఉన్నత విద్యాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ (టీజీఈఏపీసెట్) కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉండగా, జూలై 10న మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు చివరి తేదీ సోమవారం కావడంతో, ఆదివారం ఉదయం నుంచే విద్యార్థులు వెరిఫికేషన్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు.

గంటల తరబడి నిరీక్షణ.. సమయపాలన పాటించని అధికారులు..

మాసాబ్ ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఏర్పాటు చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి ఉదయం నుంచే విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి వేచి చూస్తున్నప్పటికీ ప్రక్రియ వేగంగా సాగడం లేదని వారు వాపోయారు. అధికారులు తమ విధులను నిర్లక్ష్యం చేస్తూ, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్న విద్యార్థులను పట్టించుకోకుండా, అదే కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి పదవీ విరమణ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కనీస వసతులు ఏర్పాటు చేయని వైనం..

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిసినా, అధికారులు కనీస వసతులు కూడా కల్పించకపోవడం పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత, వర్షం నుంచి రక్షణ పొందేందుకు షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిరాక్స్ నిర్వాహకుల దోపిడీ..

యూనివర్సిటీ పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రూ.1 లేదా రూ.2 మాత్రమే ఉండే జిరాక్స్ ప్రతికి రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారని, అప్లికేషన్ ఫారాలు, సర్టిఫికేట్ సెట్ల పేరుతో వందల రూపాయలు గుంజుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

బాధితుల డిమాండ్..

దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వెరిఫికేషన్ కేంద్రాలకు చేరుకుంటున్నప్పటికీ అధికారులు సమయపాలన పాటించడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసాబ్ ట్యాంక్‌లోని వెరిఫికేషన్ కేంద్రాన్ని ఉన్నతాధికారులు వెంటనే సందర్శించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, జిరాక్స్ కేంద్రాల దోపిడీని అరికట్టాలని, వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story