బెంగళూరు కేసులో కీలక పరిణామాలు.. అస‌లేం జ‌రిగిందంటే?

by Thanuru Gopichand |   (  Updated:2026-06-28 17:42:44  IST  )

తన స్నేహితురాలు బ్రేకప్ చెప్పిందనే మనస్తాపంతో కర్ణాటకకు చెందిన నాగేంద్ర (30) అనే యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.

బెంగళూరు కేసులో కీలక పరిణామాలు.. అస‌లేం జ‌రిగిందంటే?
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: వేధింపుల బంధం నుండి బయటపడాలని చేసిన ప్రయత్నం.. కదిలే క్యాబ్‌లో ప్రాణాల కోసం సాగించిన పోరాటంగా మారింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా తాలూకా జోగిహళ్లి సమీపంలో ఈ భయానక ఘటన జరిగింది. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన నాగేంద్ర (28), రమ్య (23) గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, గత నాలుగేళ్లుగా నాగేంద్ర శారీరకంగా వేధిస్తుండటంతో రమ్య అతనికి దూరమై, బెంగళూరుకు వచ్చి ఓటి టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరింది. ఫోన్ నంబర్ బ్లాక్ చేసినా వదలకుండా వారం క్రితమే బెంగళూరు వచ్చిన నాగేంద్ర.. రమ్యకు ఇటీవల మరొకరితో ఏర్పడిన స్నేహం గురించి తెలిసి, ఆమెను ఎలాగైనా తనతో తీసుకువెళ్లాలని ప్రమాదకరమైన ప్లాన్ వేశాడు.

శనివారం ఉదయం రమ్య గదికి వచ్చిన నాగేంద్ర.. ఆమెను చంపేస్తానని కత్తితో బెదిరించి, బలవంతంగా ఒక క్యాబ్ బుక్ చేసి ఎక్కించాడు. బెంగళూరు నగరం దాటిన తర్వాత "మన ఊరికి వెళ్లి ఇద్దరం కలిసే చనిపోదాం.. వేరే ఎక్కడైనా చనిపోతే మన శవాలు కూడా దొరకవు" అంటూ సైకోలా ప్రవర్తించాడు. ఈ క్రమంలో కారులోనే జరిగిన గొడవలో రమ్య భుజంపై కత్తితో పొడిచి, గొంతు కోయడానికి ప్రయత్నించాడు. రమ్య ప్రాణాల కోసం గట్టిగా ప్రతిఘటించగా, ఈ ఘోరాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ వెంటనే వాహనాన్ని ఆపి, స్థానికుల సహాయంతో రమ్యను కారులోంచి బయటకు లాగి ప్రాణాలతో రక్షించాడు.

స్థానికులు రమ్యను రక్షించడంతో తీవ్ర నిరాశకు గురైన నాగేంద్ర.. తన బ్యాగ్‌లో తెచ్చుకున్న బాంబును లైటర్‌తో అంటించడానికి ప్రయత్నించాడు. అతని వద్ద బాంబు ఉందని రమ్య గట్టిగా అరవడంతో డ్రైవర్ ప్రవీణ్ ధైర్యంగా నాగేంద్ర చేతిలోని ఒక బాంబును లాక్కున్నాడు. కానీ, మరుసటి క్షణంలోనే కారులో ఉన్న మరో బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో క్యాబ్ పూర్తిగా తగలబడిపోగా, నాగేంద్ర అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. గాయపడిన రమ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రేమ నిరాకరించిందనే కక్షతోనే నాగేంద్ర ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.

Next Story