వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు బిగ్ అలర్ట్‌

by Muthe.Rajitha |

వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు బిగ్ అలర్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్ : వాట్సాప్ వెబ్ యూజర్లకు భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(Cert-In) హెచ్చరికలు జారీ చేసింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సప్ వెబ్(WhatsApp Web) లేదా వాట్సప్ డెస్క్‌టాప్ యాప్‌లను ఉపయోగించే వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మాల్‌వేర్‌ను (Malware) వ్యాప్తి చేస్తున్నట్లు Cert-In తీవ్రంగా హెచ్చరించింది. హ్యాకర్లు యూజర్ల డివైజ్‌లను అనుమతి లేకుండా, అనధికారికంగా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో, మనకు బాగా తెలిసిన స్నేహితులు, కొలీగ్స్, కుటుంబ సభ్యుల నుండి వచ్చే వాట్సప్ మెసేజ్‌లు, వాటిలోని అటాచ్‌మెంట్ల (Attachments) విషయంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు సూచించింది.

లింకులు, ఫైళ్లతో పొంచి ఉన్న ప్రమాదం

సైబర్ నేరగాళ్లు ఈ మాల్‌వేర్ దాడి కోసం విజువల్ బేసిక్ స్క్రిప్ట్ ఫైల్స్ అనే ప్రమాదకరమైన ఫైళ్లను ఉపయోగిస్తున్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. ఇందుకోసం వారు ఇప్పటికే హ్యాక్ చేసిన వాట్సప్ ఖాతాల నుండి ఆయా యూజర్ల కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ఇతరులకు ఈ అటాచ్‌మెంట్లను పంపుతున్నారు. మనకు తెలిసిన కాంటాక్ట్ నుంచే మెసేజ్ రావడంతో యూజర్లు సాధారణంగా ఎలాంటి అనుమానం లేకుండా ఆ ఫైళ్లను ఓపెన్ చేస్తారని హ్యాకర్లు ఈ ఎత్తుగడ వేశారు. ఒకసారి పొరపాటున ఆ విజువల్ బేసిక్ స్క్రిప్ట్ ఫైల్‌ను క్లిక్ చేసి ఓపెన్ చేస్తే.. మీరు వాడుతున్న కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

రిమోట్ యాక్సెస్, పాస్‌వర్డ్‌ల చోరీ

ఈ మాల్‌వేర్ మీ డివైజ్‌లోకి ప్రవేశించిన తర్వాత, హ్యాకర్లు ఎక్కడో దూరంగా కూర్చుని మీ కంప్యూటర్‌ను రిమోట్‌గా నియంత్రిస్తారు. సిస్టమ్‌లో దాచి ఉంచిన మీ బ్యాంకింగ్, సోషల్ మీడియా తదితర ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను (Passwords) దొంగిలించడంతో పాటు, డివైజ్‌లోని డేటాను హ్యాక్ చేయడానికి ఇతర మాల్‌వేర్‌లను కూడా జొప్పించే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ వివరించింది. అందుకే, వాట్సప్‌లో ఏదైనా అనుమానాస్పద అటాచ్‌మెంట్ లేదా ఫైల్ వస్తే.. దాన్ని తెరిచే కంటే ముందే సదరు ఫైల్ పంపిన వ్యక్తికి నేరుగా ఫోన్ కాల్ లేదా సాధారణ మెసేజ్ చేసి, ఆ ఫైల్ వారే పంపించారా లేదా అనేది పూర్తిగా ధ్రువీకరించుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.

Next Story