- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు ఆశీర్వాద సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 30న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

దిశ, చింతకాని : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో ఈ నెల 30న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి, జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, ప్రధాన వేదిక, రైతులు కూర్చునే ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సభకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. వర్షం వచ్చినా కార్యక్రమానికి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, సభా ప్రాంగణంలో నీరు నిల్వ కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ సదుపాయాలు, వాహనాల రాకపోకల నిర్వహణ, రైతుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం చింతకాని మండలంలో కురిసిన భారీ వర్షానికి సభా ప్రాంగణంలో కొంత మేర బురద పేరుకుపోయినట్లు సమాచారం. సభ నిర్వహణకు సంబంధించి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






