- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీలో గెలిచిన వారంతా 'చొరబాటుదారులే'.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఓట్ల చోరీతోనే బీజేపీ ఎంపీలు గెలుస్తున్నారని, న్యాయంగా ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 140 సీట్లు కూడా రావని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) పై ఘాటు విమర్శలు చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ ఎంపీలు గెలుస్తున్నారని, ఆఖరికి ప్రభుత్వాలను కూడా అలాగే దొంగిలిస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ల అక్రమాల ద్వారానే విజయం సాధించారని రాహుల్ విశ్లేషించారు. అటువంటి వారిని బీజేపీ భాషలోనే "అక్రమ చొరబాటుదారులు" (Infiltrators) అని పిలవాలా? అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
హర్యానాలో కూడా మొత్తం ప్రభుత్వం చొరబాటుదారులదేనని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ బీజేపీ జేబులో ఉన్నాయని, ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తూ ఎన్నికల ప్రక్రియను "రిమోట్ కంట్రోల్" ద్వారా నడిపిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నిజాన్ని చూసి బీజేపీ భయపడుతోందని, ఒకవేళ దేశంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి కనీసం 140 సీట్లు కూడా రావని రాహుల్ జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుని బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీని దుయ్యబట్టారు.






