వియాస్ కంపెనీ వద్ద ఘాటు రసాయనాల కలకలం..

by Batti.Sumithra |

పరిశ్రమలు ప్రజల జీవనోపాధిని పెంచి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేవిగా ఉండాలి కానీ, ఇక్కడి పరిశ్రమలు అందుకు విరుద్ధంగా ప్రజలకు అనుకున్నంతగా జీవనోపాధిని కల్పించకపోగా అక్కడి ప్రజల ఆయుర్దాయాన్ని రోజురోజుకి తగ్గించేవిగా తయారయ్యాయి.

వియాస్ కంపెనీ వద్ద ఘాటు రసాయనాల కలకలం..
X

దిశ, చిట్యాల : పరిశ్రమలు ప్రజల జీవనోపాధిని పెంచి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేవిగా ఉండాలి కానీ, ఇక్కడి పరిశ్రమలు అందుకు విరుద్ధంగా ప్రజలకు అనుకున్నంతగా జీవనోపాధిని కల్పించకపోగా అక్కడి ప్రజల ఆయుర్దాయాన్ని రోజురోజుకి తగ్గించేవిగా తయారయ్యాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామం పంచాయతీ పరిధిలో గల వియాస్ సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం రసాయనాలు నిల్వ ఉన్న సీసాలు పగిలిపోవడంతో అందులోని ఘాటు రసాయనాలు చుట్టుపక్కలకు వ్యాప్తి చెంది పరిసర ప్రాంతాల ప్రజలను అస్వస్థతకు గురి చేసింది. గ్రామంలోని వియాస్ సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్లలో ఉపయోగించే బ్రోమిన్ కెమికల్ ద్రవపదార్థాలు అన్లోడ్ చేసుకోవడానికి వాహనంలో కంపెనీకి తీసుకువచ్చారు.

ఈరోజు ఉదయం వాహనం కంపెనీలోకి రివర్స్లో వెళ్లేందుకు ప్రయత్నించగా అనుకోకుండా వాహనంలోని బ్రోమిన్ కెమికల్ సీసాలు కొన్ని పగిలిపోయాయి. దీంతో ఆ సీసాలలోని రసాయనాలు క్రింద పడడంతో దాని ద్వారా వచ్చే ఘాటు వాసన కంపెనీ చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందింది. దీంతో ఉదయం పూట ఆ చుట్టుపక్కల వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, విద్యార్థులు, వివిధ పనులకు వెళ్లే వారు ఆ ఘాటు రసాయనాల బారినపడి తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆ వాసనకు తల తిరగడంతో పాటు కడుపులో వికారం, వాంతులు కావడం, కళ్ళు తిరగడం వంటివి జరగడంతో గ్రామస్తులంతా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కంపెనీలో మళ్లీ ఏ ప్రమాదం ముంచుకు వచ్చిందోనని ఆందోళన చెందారు. కాసేపు అయ్యాక సీసాలు పగలడం ద్వారా వచ్చిన వాసనగా తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు..

పరిశ్రమలతో పొంచి ఉన్న ప్రమాదం..

చిట్యాల మండలంలోని పిట్టంపల్లి, బోంగోని చెరువు, వెలిమినేడు, పేరేపల్లి గ్రామాల పరిధిలో రసాయన, ఫార్మా కంపెనీలు అధికంగా విస్తరించి ఉండటంతో తరచుగా ఆయా కంపెనీలలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని వాటిని బయటకి రానివ్వకుండా కంపెనీ యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీల ద్వారా తమ ప్రాణాలకు, జీవన మనుగడకు హాని ఉందని ఈ కంపెనీల ఉత్పత్తుల వల్ల పర్యావరణం దెబ్బ తినడమే కాకుండా ప్రజల ఆయురారోగ్యాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని ఈ కంపెనీల బారి నుంచి రక్షించాల్సిందిగా సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్న వారు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల విచారణ..

కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఏర్పడిన అలజడి కారణంగా సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు కంపెనీ వద్దకు వచ్చి వాస్తవ పరిస్థితుల పై విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.

Next Story