కొత్త సీసీ రోడ్ల పై కుంగిన డ్రైనేజీలు

by Batti.Sumithra |

ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యత పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొత్త సీసీ రోడ్ల పై కుంగిన డ్రైనేజీలు
X

దిశ, చంపాపేట్ : ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యత పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంపాపేట్ పరిధిలోని రెండు కీలక కూడళ్లలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ల మధ్యలో డ్రైనేజీలు కుంగిపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంపాపేట్‌లోని శివరెడ్డి అపార్ట్‌మెంట్ సమీపంలోని మూడు రహదారుల కూడలిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డుకు మధ్యలో ఉన్న డ్రైనేజీ కుంగిపోయింది. ఈ మార్గం ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ భారీ వాహనాలు, నిర్మాణ సామగ్రిని తరలించే లారీలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి.

ఈ ఒత్తిడి కారణంగానే రోడ్డు మధ్యలో డ్రైనేజీ దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పరిస్థితిని వెంటనే సరిచేయకపోతే మరింత కుంగిపోయి పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సుల్తాన్ హల్వా కోట మైసమ్మ ఆలయం సమీపంలోని మూడు రహదారుల కూడలిలో కూడా కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డులో డ్రైనేజీ కుంగిపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ఈ కూడలి ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షాలు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్, డ్రైనేజీ విభాగాల అధికారులు వెంటనే స్పందించి కుంగిపోయిన డ్రైనేజీలను శాశ్వతంగా మరమ్మతు చేయాలని, అవసరమైతే నిర్మాణ పనుల నాణ్యతపై కూడా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story