Taxpayers: 576కి చేరిన రూ. 100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటించిన వ్యక్తులు

by S Gopi |

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, 2021-22లో ఈ సంఖ్య 142గా ఉండగా, 2022-23లో 301, 2023-24లో 284, 2024-25లో 415, ఇప్పుడు 2025-26లో 576కు చేరింది.

Taxpayers: 576కి చేరిన రూ. 100 కోట్లకు పైగా ఆదాయం ప్రకటించిన వ్యక్తులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అత్యధిక ఆదాయం ప్రకటించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌లలో రూ. 100 కోట్లకు పైగా స్థూల ఆదాయాన్ని 576 మంది ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 415 మాత్రమే ఉండగా, ఒక్క ఏడాదిలోనే 161 మంది(39 శాతం) పెరగడం విశేషం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం, 2021-22లో ఈ సంఖ్య 142గా ఉండగా, 2022-23లో 301, 2023-24లో 284, 2024-25లో 415, ఇప్పుడు 2025-26లో 576కు చేరింది. అంటే, ఐదేళ్లలో హై-ఇన్‌కమ్ ట్యాక్స్‌పేయర్లు నాలుగు రెట్లకు పైగా పెరిగారు. అయితే, ఆదాయపు పన్ను చట్టం-1961 లేదా కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో 'బిలియనీర్' అనే పదానికి ప్రత్యేక చట్టపరమైన నిర్వచనం లేదని కూడా మంత్రి స్పష్టం చేశారు. అలాగే, 2016లో వెల్త్ ట్యాక్స్ రద్దు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆస్తులపై ప్రభుత్వం ప్రత్యేక గణాంకాలు నిర్వహించడం లేదన్నారు.

అదే సమయంలో దేశంలో ఆర్థిక, సామాజిక సూచీలు కూడా మెరుగుపడుతున్నాయని కేంద్రం పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వినియోగ అసమానత తగ్గుతున్నట్లు సమాజంలో ఆర్థిక అసమానతలను కొలిచే గీనీ కోఎఫిషియంట్ గణాంకాలు సూచిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 0.266 నుంచి 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందని మంత్రి తెలిపారు. అలాగే పీఎల్ఎఫ్ఎస్ నివేదిక ప్రకారం, 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2022లో 3.6 శాతం నుంచి 2025లో 3.1 శాతానికి తగ్గింది. మరోవైపు, నీతి ఆయోగ్ విడుదల చేసిన పేదరిక సూచీ ప్రకారం 2015-16 నుంచి 2019-21 మధ్య పేదరికం 24.85 శాతం నుంచి 14.96 శాతానికి తగ్గగా, దాదాపు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Next Story