- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గగనతలం మూసివేతతో విమానయాన రంగం అతలాకుతలం.. హైదరాబాద్ టూ అరబ్ దేశాల సర్వీసులు నిలిపివేత!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ గగనతలం మూతపడటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి దోహా, జెడ్డా వంటి నగరాలకు విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందే ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని డీజీసీఏ (DGCA) సూచించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుండటంతో అనేక దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో శంషాబాద్ (RGIA) అంతర్జాతీయ విమానాశ్రయంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శంషాబాద్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాలోని ఇతర ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు తాజాగా రద్దు అయ్యాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ గణాంకాల ప్రకారం, శనివారం (ఫిబ్రవరి 28) ఒక్కరోజే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా సుమారు 900 నుండి 966 విమాన సర్వీసులు రద్దు కాగా, ఆదివారం నాడు కూడా మరో 716 నుండి 800 పైగా విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. భారత విమానయాన రంగంపై కూడా దీని ప్రభావం భారీగా ఉంది. దేశవ్యాప్తంగా శనివారం నాటి 410 రద్దులకు తోడు, ఆదివారం మరో 444 విమానాలు రద్దు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇండిగో మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు చెందిన సర్వీసులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
ఈ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రయాణికుల కోసం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే తమ విమాన స్థితిని (Flight Status) ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించింది. రద్దు అయిన విమానాలకు సంబంధించి పూర్తి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప ఈ దేశాలకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని డీజీసీఏ స్పష్టం చేసింది.






