ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ బూస్ట్..

by Batti.Sumithra |

ఎన్నో దశాబ్దాలుగా విమానాశ్రయం కోసం ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ప్రజల కల సాకారం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ బూస్ట్..
X

దిశ, ఆదిలాబాద్ : ఎన్నో దశాబ్దాలుగా విమానాశ్రయం కోసం ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ప్రజల కల సాకారం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత మరో కీలక ఎయిర్ కనెక్టివిటీ కేంద్రంగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. రక్షణ శాఖ, సివిల్ ఏవియేషన్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిఫెన్స్-సివిల్ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భూసేకరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, బెంగళూరుకు చెందిన ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, మైక్రో లెవెల్ సర్వే నిర్వహించి రన్‌వే విస్తరణ, భూసేకరణ, సాంకేతిక అంశాల పై సమగ్రంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 1,500 ఎకరాలు, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాల భూమి కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ప్రాజెక్టు అమలుపై ఆశలు మరింత పెరిగాయి. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో పాటు ప్రతిపాదిత ఇండస్ట్రియల్ కారిడార్ కూడా కార్యరూపం దాల్చితే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భూసేకరణలో ప్రభుత్వం వేగం..

ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా, అదనంగా డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 1,500 ఎకరాలు, రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాల భూమిని కేటాయించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూములను గుర్తించి పూర్తి పారదర్శకతతో ముందుకు సాగాలని అధికారులు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన మైక్రో లెవెల్ సర్వే ద్వారా రన్‌వే విస్తరణ, సాంకేతిక అవసరాలు, భూసరిహద్దులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. భూసేకరణ పూర్తయిన వెంటనే భూములను రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌తో జాతీయ ప్రాధాన్యం..

ప్రతిపాదిత జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా దేశ రక్షణ అవసరాలకు కూడా ఉపయోగపడనుంది.ఇప్పటికే రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూమితో పాటు కొత్తగా కేటాయించనున్న భూముల్లో డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానుంది.వాయుసేన శిక్షణ కార్యక్రమాలు, యుద్ధ విమానాల ట్రైనింగ్, అత్యవసర కార్యకలాపాలకు ఆదిలాబాద్ కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని కొద్ది వ్యూహాత్మక ప్రాంతాల్లో మాత్రమే ఉన్న జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌ల సరసన ఆదిలాబాద్ కూడా చేరబోతుండటం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.దీంతో జాతీయ భద్రతా వ్యవస్థలో ఆదిలాబాద్ ప్రాధాన్యం మరింత పెరగనుంది.

పరిశ్రమలు, ఉపాధికి కొత్త దిశ..

ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు అమలైతే ఆదిలాబాద్ జిల్లా ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయి. రవాణా, లాజిస్టిక్స్, నిర్మాణం, హోటల్స్, పర్యాటకం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రధాన నగరాలతో నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ వ్యాపార, పారిశ్రామిక కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు జిల్లాను అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే గేమ్ ఛేంజర్‌గా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భూసేకరణ పారదర్శకంగా పూర్తి చేస్తాం.. రాజర్షి షా,జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ జిల్లాకు చారిత్రాత్మక ప్రాజెక్టు. విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తాం. జియో కో ఆర్డినేట్ల ఆధారంగా భూములను గుర్తించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని నిబంధనలు పాటిస్తూ ప్రక్రియను పూర్తి చేస్తాం.సీఎం కార్యాలయం, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి రక్షణ శాఖ,ఎయిర్‌పోర్ట్ అథారిటీకి భూములను అప్పగిస్తాం. సివిల్ ఏవియేషన్‌తో పాటు డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావడం జిల్లా అభివృద్ధికి కీలక మలుపు అవుతుంది.

ఢిల్లీ స్థాయిలో పూర్తి మద్దతు.. గోడం నగేష్,ఎంపీ ఆదిలాబాద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కేంద్ర స్థాయిలో సానుకూలంగా ముందుకు సాగుతోంది.ఇప్పటికే కేంద్ర మంత్రులతో పలుమార్లు చర్చలు జరిపాం.కేంద్ర ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా నిర్వహించింది.రక్షణ శాఖ కోరిన భూముల సేకరణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.ఈ ప్రాజెక్టు అమలైతే ఆదిలాబాద్ దేశ రక్షణ వ్యవస్థలోనే కాకుండా విమాన రవాణా రంగంలోనూ కీలక స్థానాన్ని సంపాదిస్తుంది.

దశాబ్దాల కల నెరవేరబోతోంది.. పాయల్ శంకర్,ఎమ్మెల్యే ఆదిలాబాద్

ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్ట్ కల ఇప్పుడు సాకారం దిశగా అడుగులు వేస్తోంది. జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ అంశంలో స్పష్టత రావడంతో ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైంది.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రక్షణ శాఖకు అవసరమైన భూముల కేటాయింపు పై కేంద్రానికి అధికారికంగా సమాచారం అందించింది. మిగిలిన అనుమతుల ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి.

Next Story