- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీబీనగర్ ఎయిమ్స్ దేశంలోనే అత్యుత్తమ వైద్య కేంద్రంగా ఎదుగుతుంది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్, ఎయిమ్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు బీబీనగర్ ఎయిమ్స్‌లోని అన్ని భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీబీనగర్ ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యుత్తమ'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జేపీ నడ్డా పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం రూ.1,000 కోట్ల వ్యయంతో కొనసాగుతోందని, ఇప్పటివరకు 87 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తుండగా, ఇప్పటికే రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు విద్యాభ్యాసం చేస్తున్నాయని వెల్లడించారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయని, అత్యవసర వైద్య సేవలతో పాటు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టెలీమెడిసిన్ సేవలను కూడా విజయవంతంగా అందిస్తున్నామని, ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. పరిశోధన రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ.64 కోట్ల నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం 128 పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వెయ్యికి పైగా పరిశోధనా పత్రాలు (పబ్లికేషన్స్) వెలువడటం సంస్థ పురోగతికి నిదర్శనమని అన్నారు. దేశంలో తొలిసారిగా బీబీనగర్ ఎయిమ్స్‌లో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే 547 వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేశామని వివరించారు.
దేశంలో ఎయిమ్స్‌ల అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, 20వ శతాబ్దంలో ఢిల్లీలో ఒక్క ఎయిమ్స్ మాత్రమే ఉండేదని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి హయాంలో మరో ఐదు ఎయిమ్స్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 23 కొత్త ఎయిమ్స్‌లకు శ్రీకారం చుట్టిందని, వాటిలో ఇప్పటికే 14 పూర్తి కాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది అందుబాటులో ఉందని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో ఆరోగ్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ ఈ స్థాయికి చేరుకోవడానికి 20 సంవత్సరాలు పట్టిందని, అదే స్థాయి అభివృద్ధిని బీబీనగర్ ఎయిమ్స్ చాలా వేగంగా సాధిస్తోందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎయిమ్స్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
లోపలికి రావడానికి కార్యకర్తల అత్యుత్సాహం...
బీబీనగర్ ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి నడ్డా లోపలికి వచ్చే సమయంలో కార్యకర్తలు కూడా లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. అయితే అందరికీ లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో కొంతమంది కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కార్యకర్తల గుంపులో చిక్కుకున్నారు. అయినప్పటికీ కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ తోపులాటలో ఇద్దరు గన్‌మెన్‌లు కిందపడగా, అక్కడ ఏర్పాటు చేసిన పూల మొక్కలు ధ్వంసమయ్యాయి. అలాగే లోపల నేలపై ముగ్గుతో అలంకరించడంతో, దానిపై కాలు జారి కొందరు కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు కూడా కిందపడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు తీవ్రంగా శ్రమించారు.






