- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపైనే నరకయాతన.. పాలకుల తీరుపై చింతకుంట గ్రామస్థుల ఆగ్రహం
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, ఓట్ల కోసం పడే తపన, గెలిచిన తర్వాత ఏ మాత్రం అమలు కావడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం.

దిశ,బూర్గంపాడు: ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, ఓట్ల కోసం పడే తపన, గెలిచిన తర్వాత ఏ మాత్రం అమలు కావడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని, గ్రామస్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయని చింతకుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూర్గంపాడు మండలం చింతకుంట గ్రామానికి చెందిన సోడి మార్త(30) అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ పైలట్ విజయభాస్కర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాధ గ్రామానికి బయలుదేరారు.
అధ్వానం రోడ్డు.. మృత్యువుతో పోరాటం
అయితే,గ్రామానికి ఉన్న ఒకే ఒక్క రోడ్డు గుంతలమయంగా మారి, కనీసం వాహనాలు తిరగలేని దుస్థితి ఉంది.వర్షాల కారణంగా రోడ్డు మరింత అధ్వాన్నంగా తయారైంది.అంబులెన్స్ పైలట్ విజయభాస్కర్ ఎంతో సాహసంతో, చాకచక్యంగా వాహనాన్ని నడుపుతూ గ్రామానికి చేరుకున్నారు. నిండు గర్భిణీ మార్తను అంబులెన్స్‌లోకి ఎక్కించుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా,రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా వాహనం తీవ్రంగా కుదుపులకు గురైంది.దీంతో ఆమెకు నొప్పులు మరింత తీవ్రమయ్యాయి. ఆసుపత్రికి చేరేలోపే ప్రసవం అయ్యే సూచనలు కనిపించడంతో, సిబ్బంది సమీపంలోని అడవి ప్రాంతంలోనే అంబులెన్స్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.
అడవిలోనే ప్రసవం.. ప్రాణాలు కాపాడిన ఈఎంటీ రాధ
పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారినప్పటికీ, ఈఎంటీ రాధ అధైర్య పడకుండా ఎంతో సాహసంతో వ్యవహరించారు. అంబులెన్స్‌లోనే అవసరమైన ఏర్పాట్లు చేసి,మార్తకు ప్రసవం చేశారు.మార్త పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారని,మెడికల్ టీమ్ తెలిపింది. అనంతరం వారిని సురక్షితంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పాలకుల నిర్లక్ష్యం పై ఆగ్రహం..
ఈ ఘటనపై చింతకుంట గ్రామస్థులు, ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల ముందు రాజకీయ నాయకులు కార్లలో వచ్చి హామీల వర్షం కురిపిస్తారని, గెలిచాక మా మొహం కూడా చూడరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గర్భిణీలకు సకాలంలో వైద్యం అందేలా రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేని ఈ పాలకుల నిర్లక్ష్యం మాకు శాపంగా మారిందని వారు మండిపడ్డారు.
108 సిబ్బందికి కృతజ్ఞతలు..
ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది రాధ, విజయభాస్కర్‌ల సమయస్ఫూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.వారి సాహసం వల్లనే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారు ప్రశంసించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా రేపు మరో గర్భిణీకి ఇలాంటి పరిస్థితి రాకూడదని, వెంటనే చింతకుంట గ్రామానికి రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటన జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లాలని, ఆదివాసి గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






